Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా పలువురు క్రీడాకారులు

రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా పలువురు క్రీడాకారులు
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:15 IST)
రైతుల ఉద్యమానికి పంజాబ్‌లోని ప్రముఖ క్రీడాకారులు, అథ్లెట్లు, మాజీ ఆటగాళ్లు మద్దతు ప్రకటించారు. కేంద్రం వైఖరికి నిరసనగా 35 క్రీడాఅవార్డులను వెనక్కు ఇవ్వడానికి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వచ్చారు. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు.

ఆసియా క్రీడల్లో రెండుసార్లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న రెజ్లర్‌ కర్తార్‌ సింగ్‌ క్రీడాకారుల బృందానికి నేతృత్వం వహించారు. క్రీడాకారులు ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రెస్‌క్లబ్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు కృషి భవన్‌ వద్ద అడ్డుకొని వారిని వెనక్కు పంపించారు.

కర్తార్‌ సింగ్‌ 1982లో అర్జున, 1987లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఆయనతో పాటు ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ పొందిన హాకీ ఆటగాడు గుర్మయిల్‌ సింగ్‌, మహిళల హాకీ టీమ్‌ మాజీ కెప్టెన్‌ రాజ్‌బీర్‌ కౌర్‌ తదితురులు ఉన్నారు.  ఒలింపిక్‌ మెడల్‌ విజేత, బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కూడా తన ఖేల్‌ రత్న అవార్డును తిరిగి ఇచ్చేస్తానని కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. 
 
అవార్డులు, రైతు సమస్యలు రెండూ వేర్వేరు: ఐవోఏ
దేశం గౌరవంతో ఇచ్చిన జాతీయ అవార్డులు, రైతులకు మద్దతును వేర్వేరు అంశాలుగా చూడాలని భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) క్రీడాకారులను కోరింది. 

‘రైతులకు మద్దతుగా కొంతమంది క్రీడాకారులు తమ అవార్డులను వెనక్కు ఇస్తామని అంటున్నారు. కానీ జాతీయ అవార్డులు, రైతుల సమస్యలు రెండు వేర్వేరు విషయాలు’ అని ఐవోఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా, సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
 
పద్మశ్రీ తిరిగి ఇచ్చేస్తా: పంజాబీ కవి సుర్జీత్‌ పాతర్‌ 
రైతులకు సంఘీభావంగా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రముఖ పంజాబీ కవి సుర్జీత్‌ పాతర్‌ ప్రకటించారు. 75 ఏండ్ల సుర్జీత్‌కు 2012లో పద్మశ్రీ లభించింది. ఇప్పటికే అకాలీదళ్‌ అగ్రనేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ తన పద్మవిభూషణ్‌ను, శిరోమణి అకాలీదళ్‌ (డెమోక్రాటిక్‌) నేత సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా తన పద్మభూషణ్‌ను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
పనివేళల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
రైతులకు బ్యాంకర్లు సంఘీభావం తెలిపినప్పటికీ భారత్‌ బంద్‌లో పాల్గొనడం లేదు. ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టు అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా స్పష్టం చేశారు.

తాము కూడా భారత్‌ బంద్‌లో పాల్గొనడం లేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. పనివేళల్లో యూనియన్‌ సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతారని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏలూరులో అస్వస్థతకు గురైనవారికి వైద్య పరీక్షలపై సీఎం ఆరా