కరోనా యుద్ధంలో కఠిన నిర్ణయాలు.. ఎదుర్కోక తప్పదు : ప్రధాని పిలుపు

ఆదివారం, 29 మార్చి 2020 (13:35 IST)
కరోనా వైరస్ మహమ్మారిని దేశ సరిహద్దుల నుంచి తరిమికొట్టేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని కరోనా కబళించిన తర్వాత నెలకొన్న పరిస్థితులను ఆరా తీసిన తర్వాతే దేశంలో లాక్‌డౌన్ ప్రకటించినట్టు ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. 
 
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మన్‌ కీ బాత్‌ సందేశం ఇచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా పేదప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నానన్నారు. నాకు తెలుసు మీలో కొందరు నాపై కోపంగా ఉన్నారని. కానీ కరోనాపై యుద్ధంలో ఇటువంటి కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. 
 
భారత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అతి ముఖ్యమన్నారు. లక్ష్మణరేఖను ప్రజలు మరికొన్ని రోజులు పాటించాలని కోరారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికి చాలామంది స్వీయ క్వారంటైన్‌ను పాటిస్తున్నారు. అటువంటి వారందరికి ప్రధాని అభినందనలు తెలిపారు. ఇంకా కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. 
 
హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించిన వ్యక్తులు నియమాలను ఉల్లంఘిస్తూ యధేచ్చగా తిరుగుతున్నారు. వారికి తాను చెప్పేది ఒక్కటేనన్నారు. లాక్‌డౌన్‌ నియమాలు పాటించకపోతే కరోనా వైరస్‌ డేంజర్‌ నుంచి మనల్ని కాపాడుకోవడం చాలా కష్టతరమైతదన్నారు. సామాజిక దూరం పాటించాల్సిందిగా ప్రధాని మరోమారు కోరారు. సామాజిక దూరం అంటే మానసికంగా దూరం కాదన్నారు. 
 
కోవిడ్‌-19పై పోరాటం చేస్తున్న యోధులకు భారత్‌ వందనం చేస్తుందని ప్రధాని అన్నారు. భారత్‌కు ఇది జీవన్మరణ సమస్య. కరోనాపై వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరంతరం పోరాడుతున్నారన్నారు. ఏ విధమైన భౌతిక ప్రతిఫలం ఆశించకుండా రోగులకు సేవ చేసే వైద్యుడే అత్యుత్తమ వైద్యుడని ఆచార్య చరకుడు అన్నారు. ఇటువంటి సేవాభావంతో పనిచేస్తున్న ప్రతి నర్సుకు వందనం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జవాను కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం... రూ.12 లక్షలకు కుచ్చుటోపి