రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లోని త్రిపుర సుందరి ఆలయంలో షార్ట్ వీడియోస్ చిత్రీకరణపై నిషేధం విధించింది. ఆలయ ప్రాంగణంలో అభ్యంతరకరరీతిలో చిత్రీకరించిన వీడియోలు వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలయ అధికారులు.. ఇకపై షార్ట్ వీడియోల చిత్రీకరణను నిషేధిస్తూ ఆదేశాలు జారీచేశారు. పైగా, ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారత ఉపఖండంలోని 51 శక్తిపీఠాల్లో త్రిపుర సుందరి ఆలయం ఒకటన్న విషయం తెలిసిందే. ఆలయ ప్రాంగణం కూర్మాకారంలో ఉండటంతో ఈ ఆలయం కూర్మపీఠంగా ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో బౌద్ధ స్తూప లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణానికి అభిముఖంగా ఉండటం ఈ ఆలయం మరో ప్రత్యేకత. ఉత్తర దిక్కున కూడా ఓ చిన్న ప్రవేశద్వారం ఉంది. మధ్యయుగాల నాటి బెంగాలీ ఛార్ చాలా నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ధాన్య మాణిక్య అనే రాజు 1501లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. తొలుత విష్ణువు కోసం ఆలయం నిర్మించినప్పటికీ రాజుకు కలలో అమ్మవారు కనిపించడంతో ఆయన శక్తి పీఠాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్‌లోని చట్టగాంగ్ నుంచి తెప్పించిన కస్తి శిలతో విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అలాంటి స్థల పురాణం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో అభ్యంతరకర రీతిలో తీసిన ఓ షార్ట్ వీడియో ఇటీవల వైరల్ అయింది. 'ఆలయంలో అసభ్యకర పాటలు, నృత్యాలతో షార్ట్ వీడియోలు, రీల్స్ తీయడంపై నిషేధం విధించాం. ఆలయం బ్యాక్‌గ్రౌండ్‌గా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దు' అని అధికారులు నోటీసు విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.