గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని బుధవారం కన్నుమూశారు. ఆమె గత రెండేళ్లుగా మంచానికే పరిమితమైవున్నారు. గాంధీ స్థాపించిన సేవా గ్రామ్‌లోనే ఆమె తన బాల్యాన్ని గడిపారు. ముంబైలో తుదిశ్వాస విడిచిన ఆమె వయసు 89 సంవత్సరాలు.
మహారాష్టరలోని వార్దాలో గాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలోనే ఉష బాల్యం గడిచింది. ముంబైలో మణి భవన్‌లోని గాంధీ స్మారక్ నిధికి ఉష చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మణి భవన్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉండేది.
మహాత్మాగాంధీ 1917-1934 మధ్య తరచూ మణి భవన్‌లోనే బస చేసేవారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు అక్కడే నాంది పలికింది. ఇందులో రెండు సంస్థలు కూడా ఉన్నాయి. ఒకటి గాంధీ స్మారక్ నిధి కాగా, మరొకటి మణి భవన్ గాంధీ సంగ్రాలయ. మణి భవన్‌తో గాంధీకి జీవితకాలంపాటు అనుబంధం ఉంది. కాగా, గత1955 అక్టోబరు రెండో తేదీన మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటికి అప్పగించారు.