మహారాష్ట్రలో బీజేపీ హవా తగ్గింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ కాస్త వెనక్కి తగ్గిందనే చెప్పాలి. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 101 స్థానాలకే పరిమితమైంది.
గత ఎన్నికల్లో 63 స్థానాల్లో సత్తా చాటిన శివసేన తాజా ఎన్నికల్లో కూడా 60 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబర్చింది. దీంతో శివసేన శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు శివసేన ప్రయత్నాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం పదవీ కాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీకి శివసేన ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. తొలి అవకాశం తమకే ఇవ్వాలని కూడా శివసేన కోరినట్లు తెలిసింది. ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఈ ప్రతిపాదనకు బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలంటే శివసేన డిమాండ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరి.. శివసేన పంపిన ప్రతిపాదనలో బీజేపీ మార్పులు చేర్పులకు బీజేపీ సూచనలు చేస్తుందా.. లేకుంటే శివసేన మాటకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది తేలాల్సి వుంది.