ఆయనో ఐపీఎస్ అధికారి. దేశంలోనే రెండో అత్యున్నత సర్వీసు. అలాంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి. కానీ, కన్నతండ్రిపై ఎనలేని ప్రేమానురాగాలు పెంచుకున్నాడు. చివరకు కన్నతండ్రి చనిపోయినా.. తన తండ్రి స్పందిస్తున్నాడని చెపుతూ ఇంట్లోనే నెలరోజులుగా ఆయుర్వేదం వైద్యం చేస్తూ వచ్చాడు. ఈ వింత ఐపీఎస్ అధికారి ప్రవర్తనకు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేంద్ర కుమార్ మిశ్రా. 1987 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈయన తండ్రి కేఎం మిశ్రా. వయసు 84 యేళ్లు. వృద్దాప్యంతో పాటు తీవ్ర అస్వస్థత కారణంగా గత నెలలో ఓ ఆస్పత్రిలో చనిపోయారు. ఆ తర్వాత మృతదేహాన్ని అక్కడ నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లోని పడక గదిలో ఉంచి ఆయుర్వేద చికిత్స ప్రారంభించారు.
రోజులు గడిచేకొద్దీ శవం కుళ్లిపోయి దుర్గందభరితమైన వాసన రావడంతో ఇరుగు పొరుగువారు భరించలేక పోయారు. ఐపీఎస్ అధికారి వద్ద పనిచేసేవారు తట్టుకోలేకపోయారు. ఈ విషయంపై అధికారిని నిలదీస్తే ఆయుర్వేద చికిత్సకు తన తండ్రి స్పందిస్తున్నారంటూ సీరియస్‌గా సెలవిచ్చారు. దీంతో వారు మిన్నకుండిపోయారు.
అయితే, వాసన భరించలేక ఇరుగుపొరుగువారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారు కూడా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. పైగా, ఇది సున్నితమైన విషయం కావడంతో వారు ఎలా స్పందించాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఏకే మిశ్రా చనిపోయినట్టు నిర్ధారిస్తూ ఆస్పత్రి మరణ సర్టిఫికేట్ మంజూరు చేసినా రాజేంద్ర కుమార్ శర్మ మాత్రం తన తండ్రి ఆయుర్వేద చికిత్సకు స్పందిస్తున్నారంటూ వాదించారు.
దీంతో పోలీసులు సైతం విచిత్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా, ఈ వ్యవహారం ఎంతో సున్నితమైనది కావడంతో పరిష్కరించే బాధ్యతను ఓ సీనియర్ ఆఫీసర్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నారు మధ్యప్రదేశ్ ఉన్నత అధికారులు.