శరీర ముఖ్య భాగాల్లో ఊపిరితిత్తులు ఒకటి. కానీ అవి లేని జీవి ఏంటో తెలుసా? దాని పేరు కాసిలిటా ఇవోక్రమా. దీన్ని గయానా దేశంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి ఊపిరితిత్తులే కాదు.. కాళ్లు, నాసికా రంధ్రాలు కూడా లేవు.
చూడటానికి వానపాములా కనిపిస్తుంది. నీటిలో శ్వాసించే లార్వాగా జీవనం ప్రారంభిస్తుంది. నేలపై కూడా శ్వాసించేలా శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటుంది. కొన్ని అవయవాలు లేకుండా పుట్టిన ఈ జీవి కాసిలియన్ జాతికి చెందినది.
ప్రపంచం మొత్తంమీద 120 కాసిలియన్ జాతులు ఉంటే వీటిలో ఊపిరితిత్తుల్లేనిది ఇదొక్కటే. మరి ఊపిరిత్తులు, ముక్కు రంధ్రాలు లేకుండా ఇదెలా శ్వాస తీసుకుంటోంది? వీటి చర్మంపైన కంటికి కనిపించనంత సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇవి పీల్చుకుంటాయి.
అంటే చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుందన్న మాట. వీటి కంటిచూపు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నేలపైన 11 సెం.మీ. పొడవు మాత్రమే పెరిగే ఇది, నీటిలో రెండడుగుల వరకు ఎదుగుతుంది.
కర్ణాటకలోని బెల్గాంలో కూడా ఈ జాతికి చెందిన జీవులు ఈ మధ్యనే బయటపడ్డాయి. ఇలా కొన్ని రకాల జీవులకు ఎందుకు శరీరభాగాలు ఉండవో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.