ఫ్రీ ఫైర్ గేమ్ గురించి తెలియని యువత వుండదు. ఈ పాపులర్ ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా తెలిసిన బాయ్‌ఫ్రెండ్‌ని వెతుక్కుంటూ ఓ అమ్మాయి రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది.
ఐటీ అభివృద్ధితో యువత, చిన్నారులు రకరకాల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను వినియోగిస్తుండడంతోపాటు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా చాలా మంది ప్రేమలో పడటం సర్వసాధారణమైపోయింది. కానీ ఆన్‌లైన్ గేమ్ ద్వారా ఓ ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కోసం ఓ అమ్మాయి.. ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి వచ్చేసింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ అమ్మాయి ఫ్రీ ఫైర్ ఆడుతుండగా.. ఆమెకు జార్ఖండ్‌కు చెందిన ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. చివరికి ఈ అలవాటు ప్రేమగా మారి, ఆ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని కలవాలని నిర్ణయించుకుంది.
ఇందుకోసం బాలిక తన ఇంటికి తెలియకుండా పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ వెళ్లింది. బాలిక కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు ఆమె మొబైల్‌ను గుర్తించారు. వారిద్దరిని కనిపెట్టారు. ఆపై వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. తల్లిదండ్రుల వద్దకు పంపారు.