కర్నాటక రాష్ట్రానికి చెందిన ఉమేష్, రాష్ట్ర ఆంబులెన్స్ విభాగంలో డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా కరోనా బాధితుల కోసం రేయింబవళ్లు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. విశ్రాంతి లేని కారణంగా అతడు తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటుకు గురై కన్నుమూశాడు.
ఈ నేపధ్యంలో దహనక్రియలకు తన దగ్గర కావల్సినంత డబ్బు లేకపోవడంతో భార్య తన మెడలో వున్న తాళిబొట్టును కుదవబెట్టి భర్త దహనక్రియలను పూర్తి చేసింది. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. మరిణించిన ఉమేష్‌కి ఇద్దరు పిల్లలు వుండటంతో తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అతడి భార్య విన్నవించింది.
ఈ విషాద ఘటన తెలుసుకున్న కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సీఎం సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఉమేష్ భార్య తన భర్త లాక్ డౌన్ ప్రకటించిన మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారనీ, దీనితో ఆకస్మిక గుండెపోటు సంభవించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారని తెలిపింది. తమ కుటుంబానికి ఆధారమైన తన భర్త చనిపోవడంతో ఏ ఆధారంలేకుండో పోయిందని, ప్రభుత్వమే తమకు ఏదయినా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.