ఈ ఏడాది వర్షాలు సాధారణం కన్నా తక్కువే ఉంటాయని స్కైమెట్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రతి సంవత్సరం జూన్ మాసం ప్రారంభంలో రుతుపవనాలు కేరళ రాష్ట్రంలో ప్రవేశించే విషయం తెలిసిందే. రుతుపవనాలు ఆ రాష్ట్రాన్ని తాకిన తర్వాతే దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. అయితే ఈ ఏడాది సాధారణ వర్షపాతం కన్నా తక్కువే వర్షాలు కురుస్తాయని స్కైమెట్ సంస్థ చెప్పింది.
లాంగ్ పీరియడ్ రేంజ్(ఎల్‌పీఏ)లో రుతుపవనాల ప్రభావం 93 శాతం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది బిలో నార్మల్ రేంజ్ అని ఆ సంస్థ పేర్కొంది. 1951 నుంచి 2000 సంవత్సరం వరకు ఎల్‌పీఏ వర్షపాతం సగటున 89 సెంటీమీటర్లు ఉంది. ఎల్‌నినో ప్రభావం వల్లే వర్షపాతం ఈసారి సాధారణం కంటే తక్కువగా ఉంటుందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు.