కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షిణ భారతదేశంపై కన్నేశారు. ఉత్తరభారతంలో తమ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగా ఉందన్న విషయాన్ని ఆయన గ్రహించారు. దీంతో ఆయన దక్షిణభారతంపై కన్నేశారు. దీంతో 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కేరళ రాష్ట్రలోని వాయినాడ్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఈ ఎన్నికల్లో రాహుల్ ఈ దఫా ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయమై క్లారిటీ వచ్చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తెలిపారు. ఈ రెండు స్థానాల నుంచి పోటీకి రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు.
ఈ విషయాన్ని ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వాయనాడ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎం.ఐ.షానవాజ్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే గతేడాది ఆయన చనిపోవడంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయించారు.