దాణా స్కామ్ : మూడో కేసులో కూడా లాలూ ముద్దాయే.. ఐదేళ్ళ జైలు
దాణా స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటికే దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు మరో కేసులో కూడా ఆయన దోషిగా తేలారు.
దాణా స్కామ్‌లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటికే దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఇపుడు మరో కేసులో కూడా ఆయన దోషిగా తేలారు. ఈ కేసులో మరో ఐదేళ్ళ జైలుశిక్షను విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆయనతో పాటు దోషిగా తేలిన మాజీ సీఎం జగన్నాథ మిశ్రాకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. అలాగే ఇద్దరికీ రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది.
బుధవారం ఉదయం విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం వీరిద్దరినీ దోషులుగా తేల్చింది. మధ్యాహ్నం శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ రెండో దాణా కుంభకోణం కేసులో మూడున్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు.
మూడో దాణా కుంభకోణం కేసులో ఛాయ్‌బసా ఖజానా నుంచి రూ.36 కోట్లు అక్రమంగా పొందినట్లు లాలూ, మిశ్రాపై కేసు నమోదైంది. 2013 మొదటి దాణా కుంభకోణం కేసులో లాలూకు అయిదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయనపై మొత్తం ఐదు దాణా కుంభకోణం కేసులు ఉన్నాయి. రెండో దాణా కుంభకోణం కేసులో ఈనెల 6న లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ ఇదే సీబీఐ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఆయనపై మరో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.