ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనను అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన... రైతుల ఉసురు తీసిన ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
కేంద్రం తెచ్చిన వివాదస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై నిర్దాక్షిణ్యంగా కారు తోలి హత్య చేయడం తనను కలచివేసిందని పేర్కొన్నారు.
లఖింపూర్ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మరణించిన బాధిత కుంటుంబాలకు త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ అన్నారు.
కాగా, లఖీంపూర్ ఖేరీలో దేశం మొత్తాన్ని దిగ్భాంతి పరిచిన విషయం తెల్సిందే. ఈ హింసాత్మక ఘటనలకు నిరసనగా యూపీ నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు చెలరేగాయి. రైతు సంఘాల నేతలు, ప్రతిపక్షాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి.