కోల్‍కతాలోని ఆర్జీ కర్ వైద్య కాలేజీ ఆస్పత్రికి చెందిన జూనియర్ మహిళా వైద్యురాలిపై హత్యాచారం జరిగితే, ఆస్పత్రి వర్గాలు మాత్రం ఆమె బలవన్మరణానికి పాల్పడిందంటూ చెప్పడం ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ అంశంపైనే సీబీఐ లోతుగా దర్యాప్తు సాగిస్తుంది. ఈ కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అధికారులు 23 గంటలకు పైగా ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం మొదలైన విచారణ ఆదివారం తెల్లవారుజాము వరకు కూడా కొనసాగింది.
అర్థరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఆయనకు సీబీఐ అధికారులు స్వల్ప విరామం ఇచ్చారు. ఆ సమయంలో సందీప్ ఘోష్ తన నివాసానికి వెళ్లి వచ్చారు. వచ్చేటప్పుడు ఆయన కొన్ని ఫైళ్లను పట్టుకొచ్చారు. మరోవైపు, తమ కుమార్తె కొన్నాళ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉందని, విధులకు హాజరయ్యేందుకు వెనుకంజ వేయడం గమనించామని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.
అయితే, ఆమెపై దారుణం జరిగితే, ఆత్మహత్య అని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడం అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొన్నారు. ఈపరిస్థితుల్లో సీబీఐ అధికారులు మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను కొన్ని గంటల పాటు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. కాగా, విచారణ నిమిత్తం లోపలికి వెళుతూ సందీప్ ఘోష్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను అరెస్టు చేయలేదని, దయచేసి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేయవద్దని విజ్ఞప్తి చేశారు. సీబీఐ అధికారులు నన్ను విచారిస్తున్నారు... ఈ దశలో ఇంతకుమించి ఏమీ చెప్పలేను అని సందీప్ ఘోష్ పేర్కొన్నారు. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే.