భారత గణతంత్ర వేడుకల దినోత్సవం రోజున ఎర్రకోటపై జరిగిన దాడి కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఇక్బాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, పంజాబ్ నటుడు దీప్ సిద్ధూతో పాటు కీలక నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ దాడి కేసులో 38 మంది ఎఫ్ఐఆర్‌లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.
కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత నెల 26వ తేదీన ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హింస చెలరేగింది. కొందరు ముష్కరులు ఎర్రకోటపై దాడికి దిగారు. జాతీయ జెండాను ఎగురవేసే స్థానంలో ఓ మత జెండాను ఆందోళనకారులు ఎగురవేశారు. ఈ దాడి ఘటనపై కేంద్రం సీరియస్ అయింది.
ఈ నేపథ్యంలో దాడి కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఇక్బాల్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి పంజాబ్‌లోని హోషియాన్ పూర్‌లో స్పెషల్ సెల్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇక్బాల్ ఆచూకీ తెలిపితే రూ.50 వేల రివార్డును కూడా పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ కేసులో ఏ1గా ఉన్న దీప్ సిద్ధూను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆపై ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా, 7 రోజుల కస్టడీని విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆయన్ను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఢిల్లీ పోలీసులు, పలు కీలక వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. దీప్ సిద్ధూ గత వీడియోలు, ప్రసంగాలు, ఆయన రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న వీడియోలను చూపిస్తూ, వివరాలను అడుగుతున్నట్టు సమాచారం.
అలాగే, ఇదే కేసుల రూ.50 వేల రివార్డును పోలీసులు ప్రకటించిన మరో నిందితుడు సుఖ్ దేవ్ సింగ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చండీగఢ్ నుంచి ఆయన పారిపోతున్నాడన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు, దాదాపు 100 కిలోమీటర్ల దూరం చేజ్ చేసి సుఖ్ దేవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.