Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మత మార్పిడి చట్టాన్ని రద్దు చేసిన కర్నాటక ప్రభుత్వం

Advertiesment
Siddaramaiah-Shivakumar
, గురువారం, 15 జూన్ 2023 (19:05 IST)
కర్నాటక రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్‌ గురువారం రద్దు ప్రతిపాదనను ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ వెల్లడించారు. దీన్ని త్వరలోనే బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టి అమల్లోకి తెస్తామన్నారు. 
 
కర్ణాటకలో గత భాజపా ప్రభుత్వం మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బలవంతంగా, వంచించి, ఒత్తిళ్లు తీసుకు వచ్చి, తాయిలాలను ఆశచూపి, వివాహం చేసుకుంటానని నమ్మించి మతమార్పిడికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. 
 
దీనికి సంబంధించి పౌరులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములు, సహోద్యోగులు పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే జామీను రహిత అరెస్టు ఉంటుంది. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడే వ్యక్తులకు 3 నుంచి 10 ఏళ్ల శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.
 
ఇందుకు సంబంధించిన బిల్లును గతేడాది అప్పటి ముఖ్యమంత్రి బొమ్మై నేతృత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టారు. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే, శాసనమండలిలో భాజపాకు సరిపడా మెజార్టీ లేకపోవడంతో బిల్లు ముందుకెళ్లలేదు. దీంతో గతేడాది మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదంతో చట్టాన్ని అమలు చేశారు. ఇప్పుడు భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్‌ అధికారంలో రావడంతో సిద్ధరామయ్య సర్కారు.. ఈ చట్టాన్ని రద్దు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో ఘోరం... ఒకే ఫ్యామిలీలో ఆరుగురి సజీవదహనం