కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని కళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావడంపై జనవరి చివరి వారంలో ప్రారంభమైన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. మంగళవారం ఉడుపి, మాండ్య తదితర జిల్లాల్లో విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ వివాదంపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమలహాసన్ స్పందించారు. ఈ వివాదం విద్యార్థుల మధ్య మత విద్వేషంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నా అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
ఈ వివాదం అమాయక విద్యార్థుల మధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయని కమల్ హాసన్ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతోన్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలన్నారు.