ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని సిర్పి తాలూకా హీపనళ్ళిలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ గ్రామంలో ఒక రైతుకు చెందిన ఓ ఆవు బంగారు చైన్ మింగేసింది. దీన్ని వెలికి తీసేందుకు ఆవుకు ఆపరేషన్ చేశారు. ఈ సంఘటన దీపావళి సమయంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తి ఆ రైతు. తన కుటుంబ సభ్యులతో కలిసి గత దీపావళి పండుగను పురస్కరించుకుని గోపూజను నిర్వహించారు. ఇందుకోసం ఆవు, లేగదూడను అందంగా ముస్తాబు చేశారు. పూలదండలతో పాటు బంగారు గొలుసు కూడా వేశారు. అయితే, ఈ పూజ పూర్తయిన తర్వాత బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో ఆవు లేదా లేగదూడ మింగేసివుంటుందని భావించారు.
అప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం పేడను పరిశీలిస్తూ వచ్చారు. ఎంతకీ గొలుసు కనిపించకపోవడంతో ఓ రోజున పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఆవు పొట్టలో గొలుసు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆవు పొట్టకు స్కానింగ్ చేసిన గొలుసు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. పిమ్మట కుటుంబ సభ్యుల వినతి మేరకు ఆవుకు ఆపరేషన్ నిర్వహించి, బంగారు గొలుసును వెలికి తీశారు.