కర్ణాటక మరకుంబి గ్రామంలో దళితులపై హింసాత్మక దాడికి పాల్పడినందుకు కొప్పల్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా విధించింది.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దోషులపై అభియోగాలు మోపారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, స్పెషల్ జడ్జి సి చంద్రశేఖర్ మరో ముగ్గురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు.
గంగావతి రూరల్ పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో మొదట 117 మంది పేర్లను నమోదు చేశారు. అయితే కొంతమంది నిందితులు మరణించారు. ఛార్జ్ షీట్‌లో కొందరి పేర్లు పునరావృతమయ్యాయి.
చివరకు 101 మంది నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. హింసాత్మక సంఘటన ఆగష్టు 29, 2014న, గంగావతి తాలూకాలోని మరకుంబి గ్రామం జరిగింది. ఈ సందర్భంగా అగ్రవర్ణాల వ్యక్తుల గుంపు ఎస్సీ కమ్యూనిటీ సభ్యులపై దాడి చేసి, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు.