కర్నాటక రాష్ట్రంలో 73 యేళ్ల బామ తన మనవడి కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడింది. ఏడు పదుల వయసులో కూడా తన కిడ్నీ దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. అదేసమయంలో తన మనవడి ప్రాణాలను కూడా కాపాడుకుంది. రాష్ట్రంలోని బెళగావిలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే,
కర్నాటక రాష్ట్రంలోని బెళగావి సమీపంలోని హరుగేరికి చెందిన 21 యేళ్ల సచిన్ చిన్నప్పటి నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఇంతకాలం మందులతో నెట్టుకొచ్చారు. ప్రస్తుతం సచిన్‌కు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నీ దానం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమైనప్పటికీ.. వారి అనారోగ్యం కారణంగా వైద్యులు నిరాకరించారు.
దీంతో ఆరోగ్యంగా ఉన్న 73 యేళ్ల బామ... తన మనవడిని బతికించుకోవడానిక కిడ్నీ ఇస్తానంటూ ముందుకు వచ్చారు. దీంతో డాక్టర్ రవీంద్ర మద్రా సారథ్యంలోని వైద్యులు బెళగావిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ కిడ్నీ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంతో ఉన్నారని, 73 యేళ్ల వయసులోనూ బామ కిడ్నీ దానం చేయడం గొప్ప విషయమని వైద్యులు అంటున్నారు.