రాజకీయాలకంటే ప్రజలే ముఖ్యం.. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తాలి: కమల్
సినీనటుడు కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ప్రజల సమస్యలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. పార్టీ ప్రకటనకు ముందే ప్రజలతో అనుసంధానం అవసర
సినీనటుడు కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ప్రజల సమస్యలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. పార్టీ ప్రకటనకు ముందే ప్రజలతో అనుసంధానం అవసరమని భావిస్తున్నానన్నారు. అందుకోసం తమిళనాడు పర్యటన చేస్తానని.. ఆపై సరైన సమయంలో పార్టీ ప్రకటన వుంటుందని కమల్ హాసన్ తెలిపారు. రాజకీయాలకన్నా తనకు ప్రజలే ముఖ్యమని కమలహాసన్ అన్నారు.
మంచిపనులు చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నానని కమల్ ప్రకటించారు. పార్టీని బలమైన పునాదులతో ఏర్పాటు చేసుకుంటానని చెప్పారు. ఇందులో భాగంగా కమలహాసన్ ‘మియామ్ విజిల్’ (Maiyam-Whistle) యాప్‌ను విడుదల చేశారు. అంతేగాకుండా #theditheerpomvaa, #vituouscycle హ్యాష్ ద్వారానూ ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చునని తెలిపారు.
ఈ యాప్ ద్వారా ప్రజలు ఎక్కడైనా అన్యాయం జరిగితే తెలియజేయొచ్చని, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తాలని పిలుపునిచ్చారు. కాగా మియామ్ విజిల్ యాప్ కోసం 20 నుంచి 25 మంది పనిచేస్తున్నారని, ప్రస్తుతం బీటా వెర్షన్‌ను పరీక్షిస్తున్నామని కమల్ చెప్పారు.
ఇంకా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉగ్రవాదులు అన్న పదాన్నే అస్సలు వాడలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. తాను అతివాదులు, తీవ్రవాదులు అనే పదాలను మాత్రమే వాడానని చెప్పుకొచ్చారు. హిందువుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని కమల హాసన్ వివరణ ఇచ్చారు.
తాను కూడా హిందూ కుటుంబానికి చెందినవాడినేనని అన్నారు. పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చాలా వార్తలే వచ్చాయి. కానీ తానింకా చాలా కసరత్తు చేయాల్సిఉంది. అభిమానులతో కూర్చొని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాకే పార్టీ ప్రకటన చేస్తానని కమల్ అన్నారు. తన టీంను జనవరిలో ప్రకటిస్తానని చెప్పారు.