ఇటీవల ముంబైలో జరిగిన ఎడిటర్ నిత్యానంద్ పాండే హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన వద్ద పని చేసే ఓ లేడీ రిపోర్టర్‌ను లైంగికంగా వేధించినందుకుగాను నిత్యానంద్ హత్యకు గురైనట్టు తేల్చారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, న్యూస్ పోర్టల్ ఎడిటర్ నిత్యానంద్ పాండే (44) ఇటీవల హత్యకు గురయ్యాడు. ఇది ముంబైలో కలకలం రేపింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
న్యూస్ పోర్టల్ కార్యాలయంలో విలేఖరి లేదా సబ్‌ఎడిటర్‌గా ఇంటర్న్ షిప్ చేస్తున్న యువతి రెండేళ్లుగా పనిచేస్తోంది. సదరు యువతిని నిత్యానంద పాండే ఎన్నో మార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. తనను ఇక వదిలేయాలని ప్రాధేయపడింది. అప్పటికీ మాట వినకపోవడంతో ఆమె ఎదురుతిరిగింది. దీంతో ప్రమోషన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ఆమె ముద్రణా విభాగంలో పనిచేసే సతీశ్ మిశ్రా సాయం కోరింది. అప్పటికే పాండే తనకు వేతనాలు ఆలస్యంగా ఇస్తున్నాడన్న ఆగ్రహంతో ఉన్న సతీశ్ ఆమెకు సహకరించేందుకు అంగీకరించాడు.
సతీశ్‌తో కలిసి పాండేను హత్య చేయాలని ప్లాన్ చేశారు. తమ ప్లాన్‌లో భాగంగా, పాండేను ముంబైకి 8 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర భయందర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. వెళ్తున్న సమయంలో వాహనంలోనే మత్తుమందు కలిపిన మద్యం తాగించారు. స్పృహలో లేని పాండేను తాడు సాయంతో గొంతు బిగించి చంపి, భివండీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సతీశ్ మిశ్రాతో పాటు.. ఆ లేడీ రిపోర్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.