ఇంటి నుంచే ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్న వేళ.. ఇక ఇంటి నుంచే ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. ముందుగా ప్రయోగాత్మకంగా బీటెక్ 8వ సెమిస్టర్ విద్యార్థులకు నిర్వహించాలని భావిస్తున్నారు.
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడగా, అనేక పరీక్షలు వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అంశంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.
గతేడాది విద్యార్థులకు సమీపంలోని కాలేజీల్లో పరీక్షలు రాసుకొనే వెసులుబాటును కల్పించారు. ఇలా పరీక్షా కేంద్రాలను ఎంచుకునే అవకాశమిచ్చి, సెమిస్టర్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించారు.
ఈసారి కరోనా ఉధృతి గతేడాది కంటే తీవ్రంగా ఉండటంతో పరీక్షాకేంద్రాల్లో నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదనే నిర్ణయానికి వచ్చారు. బీటెక్ చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ పరీక్షలు కావడం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, జూన్, జూలై మాసాల్లో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
ఈ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని.. పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూరు హస్సేన్ తెలిపారు.