జార్ఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంపయి సొరేన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. సోమవారం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి చంపయి సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎట్టకేలకు విజయం సాధించడంతో ఉత్కంఠ వీడిపోయింది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలకుగానూ 47 మంది ఆయనకు మద్దతిచ్చారు. ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంపయీ సోరెన్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భారతీయ జనతా పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా యత్నించింది. హేమంత్ సోరెన్‌పై తప్పుడు కేసు పెట్టారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. నేను ఆయనకు పార్ట్-2" అని చంపయి వ్యాఖ్యానించారు.
మరోవైపు, భూ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అసెంబ్లీకి తీసుకువచ్చారు. బలపరీక్షలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. 'జనవరి 31 రాత్రి.. దేశంలో మొదటిసారి ఒక ముఖ్యమంత్రి అరెస్టయ్యారు. దాని వెనgక రాజ్‌భవన్ జోక్యం ఉందని నేను నమ్ముతున్నాను' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాము ఓటమిని అంగీకరించడం లేదన్నారు. తనపై ఉన్న ఆరోపణలను ఈడీ నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ సవాల్ విసురుతున్నట్టు ప్రకటించారు. చంపయి సోరెన్‌కు అధికార సంకీర్ణ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉందని వెల్లడించారు. అయితే, వాస్తవంగా రాజీనామా సమర్పించిన తర్వాతే హేమంత్ అరెస్టు అయ్యారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.