Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై విజయవాడ పట్టు తగ్గిపోయిందా?

Vangaveeti Ranga

బిబిసి

, సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (18:12 IST)
కర్టెసి-ట్విట్టర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోనూ బెజవాడ ఓ పెద్ద రాజకీయ అడ్డా. రాజకీయ కేంద్రంగా చాలా కాలం పాటు తెలుగు నాట అనేక పరిణామాలను ప్రభావితం చేసింది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బెజవాడ ప్రభావం తగ్గింది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ప్రాంతంగా ప్రాభవం పెంచుకునే ప్రయత్నం జరిగింది. కానీ, ఆశించిన స్థాయిలో అలాంటి ముద్ర కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది. విజయవాడ మీద పట్టు నిలుపుకొంటే రాజకీయంగా ఓ మెట్టుపైన ఉండవచ్చని పార్టీలన్నీ భావించిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
 
రాష్ట్రస్థాయిలో కాదు కదా, కనీసం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగానూ ప్రభావం చూపగల నాయకులు కరవయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. గడిచిన ఏడు దశాబ్దాలుగా విజయవాడ రాజకీయాలు ఎలా మారాయి? ఇప్పుడు విజయవాడ రాజకీయాల ప్రభావం ఇతర ప్రాంతాలపై ఎలా ఉందన్నది ఆసక్తికరం.
 
హేమాహేమీలకు నిలయం
విజయవాడ నుంచి ఎంతో మంది కీలక నేతలుగా ఎదిగారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించారు. 1952లో జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ నుంచి బెంగాల్‌కు చెందిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ విజయం సాధించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సరోజిని నాయుడి సోదరుడే హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ. ఆ తర్వాత కేఎల్ రావు మూడుసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 1977లో విజయవాడ నుంచి గెలిచిన గోడె మురహరి, లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌గా కొంతకాలం వ్యవహరించారు.
 
చెన్నుపాటి విద్య, పర్వతనేని ఉపేంద్ర, వడ్డే శోభనాద్రీశ్వర రావు, లగడపాటి రాజగోపాల్‌తో పాటుగా సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని కూడా రెండుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ సమాచారశాఖ మంత్రిగా ఉపేంద్ర పనిచేశారు. విజయవాడ కేంద్రంగా కాకాణి వెంకటరత్నం నుంచి వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ వరకూ అనేక మంది నేతలు చక్రం తిప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు.
 
రెండు దశాబ్దాల హత్యా రాజకీయాలు
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో రాజకీయాలు ప్రశాంతంగా కనిపించినప్పటికీ ఆ తర్వాత క్రమంగా వేడెక్కాయి. విజయవాడ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం పోరు సాగింది. పైచేయి సాధించడం కోసం వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు దాడులు, హత్యలు చేసుకునే వరకు వెళ్లింది. ఆ పరిణామాలు విజయవాడ రాజకీయాల్లో ఓ రక్తచరిత్రను రాశాయి. 1966లో విజయవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొదలైంది. ఆ తర్వాత ఆటోనగర్‌గా ప్రసిద్ధి చెందింది. అప్పటికే నగర రాజకీయాల్లో కమ్యూనిస్టులకు కొంత పట్టు ఉండేది. 1964లో చీలిక తర్వాత సీపీఐకి నగరంలో ఆధిక్యం దక్కింది.
 
సీపీఐ నాయకుడు చలసాని వెంకటరత్నం నాయకత్వంలోని కార్మిక సంఘాల్లో ఎదిగిన వంగవీటి రాధాకృష్ణారావు ఆ తర్వాత చలసానితో విబేధించారు. 1971లో చలసాని వర్గానికి చెందిన దత్తి కనకారావు హత్యకు గురికావడంతో హత్యా రాజకీయాలకు తెరలేచింది. ప్రతీకారంగా రాధా వర్గీయుల హత్యలు జరిగాయి. చివరకు 1972లో చలసాని వెంకటరత్నం హత్యతో పరిణామాలు మారిపోయాయి. అదే సమయంలో విద్యార్థి దశ నుంచి ఎదిగిన దేవినేని నెహ్రూ కూడా రాధాకి అనుచరుడిగా మారారు. కమ్యూనిస్టు పార్టీ సంఘాలకు, రాధాకు అనుకూలంగా ఏర్పాటైన కొత్త సంఘాలకు మధ్య వైరం నడిచేది. రెండు వర్గాలకు చెందిన విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల మధ్య దాడులు, ప్రతిదాడులు తరచుగా సాగేవి.
 
వంగవీటి, దేవినేని వర్గాల వైరం
చలసాని వెంకటరత్నం హత్యకు ప్రతీకారంగా రెండేళ్లకు వంగవీటి రాధాను హత్య చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న దేవినేని నెహ్రూకు, వంగవీటి రాధా వర్గానికి విభేదాలు మొదలయ్యాయి. వంగవీటి రాధా వారసుడిగా ఆయన సోదరుడు వంగవీటి రంగా కొంతకాలానికి తెరమీదకు వచ్చారు. అప్పటినుంచి పరిస్థితులు రంగా వర్సెస్ నెహ్రూగా మారిపోయాయి. 1978లో సిటీ బస్సుల జాతీయీకరణ ఉద్యమంలో వంగవీటి రంగా, దేవినేని నెహ్రూల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. రంగాతో విబేధించిన దేవినేని నెహ్రూ చివరకు తన అన్నయ్య దేవినేని గాంధీ స్థాపించిన యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య అగ్గి రాజుకుంది.
 
1979లో ఐటీఐ కాలేజీ ఎన్నికల్లో దేవినేని గాంధీని రంగా వర్గం హత్య చేసింది. ఈ హత్య కేసులోని నిందితుల్ని దేవినేని గాంధీ వర్గీయులు హత్య చేశారు. దీనికి ప్రతీకారంగా 1988లో గుంటూరు జిల్లా యడ్లపాడు సమీపంలో దేవినేని నెహ్రూ సోదరుడు మురళి హత్య జరిగింది. పరీక్షల కోసం వెళ్లి, నెల్లూరు నుంచి వస్తుండగా ఆయన హత్యకి గురయ్యారు. ఇది జరిగిన కొన్ని నెలలకే గిరిపురం వాసుల ఇళ్ల పట్టాల సమస్యపై దీక్ష చేస్తున్న అప్పటి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వంగవీటి రంగాను హత్య చేశారు. 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున జరిగిన ఈ హత్య ప్రభావం అనేక ప్రాంతాల్లో పడింది. అప్పుడు జరిగిన అల్లర్లలో 45 మంది మరణించారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యాయి.
 
హత్యకు కారకులుగా భావిస్తూ దేవినేని నెహ్రూ అనుచరుల ఆస్తులు తగులబెట్టారు. మరణానికి ముందు వంగవీటి రంగా కాపు నేతగా ఎదిగారు. కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాపు నాయకుడిగా ఆయన కృష్ణా నదీతీరంలో లక్షలాది మందితో నిర్వహించిన కాపునాడు సభ విజయవంతమైంది. ఆయన నిర్వహించిన ఖమ్మం సభకు కూడా భారీగా హాజరయ్యారు. దీంతో ఆయన హత్య కమ్మ, కాపుల మధ్య వైరంగా మారింది.
 
1991 వరకు ప్రతీకార చర్యలు ఎక్కువగా జరిగాయి. ఈ క్రమంలో పలువురు హత్యకు గురయ్యారు. 1970 ఆరంభంలో మొదలైన విజయవాడ హత్యా రాజకీయాల ప్రకంపనలు 1990 వరకు తీవ్రంగా కనిపించాయి. ఆ తర్వాత కూడా ఆధిపత్యపోరు వివిధ రూపాల్లో కొనసాగుతోంది. రెండు వైపులా మరికొందరు హత్యకు గురయ్యారు. కానీ గతంలో ఉన్నంత తీవ్రత కనిపించలేదు.
 
మారిన రాజకీయ కేంద్రాలు
1990ల వరకు వివిధ పార్టీలకు విజయవాడ రాజకీయ కేంద్రంగా ఉండేది. రంగా హత్య తర్వాత చెలరేగిన అల్లర్లు, వివిధ కారణాలతో కమ్యూనిస్టు పార్టీలతో పాటుగా దాదాపు అందరూ తమ రాజకీయ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చుకున్నారు. కంకిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించిన దేవినేని నెహ్రూ కూడా తొలుత టీడీపీలో, ఆ తర్వాత కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. మంత్రిగా వ్యవహరించారు. వివిధ కారణాలతో ఆయన తన వ్యవహారాలను ఎక్కువగా హైదరాబాద్ నుంచే నడిపేందుకు ప్రాధాన్యమిచ్చారు. వంగవీటి కుటుంబం నుంచి రంగా భార్య రత్నకుమారి, వారి తనయుడు రాధా కూడా ఎమ్మెల్యేలు అయ్యారు.
 
రాష్ట్రవ్యాప్తంగా పలు రాజకీయ కార్యకలాపాల్లో నేటికీ చేరుగ్గా పాల్గొంటున్నారు. వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగే ప్రయత్నాల్లో ఉన్నారు. దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ 2019లో గుడివాడ నుంచి బరిలోకి దిగారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సాఆర్‌సీపీ తరఫున విజయవాడ తూర్పు టికెట్‌ను ఆశిస్తున్నారు. తరాలు మారడం, ఆనాటి హత్య రాజకీయాలు తగ్గుముఖం పట్టడంతో వర్తమాన విజయవాడ రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒకప్పుడు నెహ్రూ, రంగా శిబిరాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి స్థానంలో ఇప్పుడు కొత్త నేతలు తెరమీదకు వచ్చారు.
 
కేశినేని ఇంటిపోరు
ఇటీవల విజయవాడ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేశినేని నాని. గడిచిన పదిహేనేళ్లుగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. తొలుత పీఆర్పీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత టీడీపీలో చేరి రెండుసార్లు గెలిచారు. ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన నానికి వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం కేశినేని కుటుంబ వైరం విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నాని వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తే ఆయనతో ఎన్నికల్లో తలపడేందుకు నాని సోదరుడు చిన్ని సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం టీడీపీలో కీలక నేతగా ఉన్న కేశినేని చిన్నికి టీడీపీ టికెట్ ఇస్తే అన్నాదమ్ముల వైరం ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.
 
సీనియర్ నేత మల్లాది విష్ణు వంటి వారికి వచ్చే ఎన్నికల్లో సీటు లేదని వైఎస్సార్సీపీ చెబుతోంది. అప్పటి వర్గ రాజకీయాలకు చెందిన తరం ఇక క్రియాశీల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం కోల్పోయినట్టేనని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీలో దేవినేని అవినాష్‌తో పాటుగా వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారు చక్రం తిప్పుతున్నారు. టీడీపీలో మాత్రం బొండా ఉమా, బుద్దా వెంకన్న వంటి వారి హవా సాగుతోంది. వీరి కుటుంబాలు ఉత్తరాంధ్ర నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడ్డాయి. ఇలా చూస్తే విజయవాడ రాజకీయాల్లో వలస నేపథ్యం ఉన్న వారి హవా పెరుగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.
 
కొత్తతరంలో వచ్చిన మార్పులు
విజయవాడ అంటే కులాల కుమ్ములాటలు, వర్గాల ఆధిపత్యపోరు, ముఠా తగాదాలు అన్నట్టుగా ఉండేది. కొందరు సామాన్యులు కూడా అక్కడ నాయకులుగా ఎదిగారు. ఎందరో బలయ్యారు. కొందరు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేస్థాయికి చేరారు. కానీ, కాలక్రమంలో జరిగిన పరిణామాలు విజయవాడ రాజకీయాల్ని మార్చేశాయి. ఒకనాడు రౌడీయిజం, హత్యా రాజకీయాలతో నిత్యం వేడిగా ఉండే బెజవాడ ఇప్పుడు కొంత చల్లారింది.
 
వ్యవసాయం ఆధారంగా ఎదిగి, మోటార్ ఫీల్డ్ వంటి రంగాల్లో ముందు నిలిచిన విజయవాడ అభివృద్ధి రౌడీయిజం వల్ల నెమ్మదించింది. 90లలో వచ్చిన మార్పులతో హైదరాబాద్, విశాఖపట్నం అభివృద్ధిలో వేగంగా ముందుకెళ్లాయి. అదే సమయంలో యువత కొత్తదారులు ఎంచుకోవడంతో రౌడీయిజం తగ్గింది. కుల వైషమ్యాలు కొనసాగుతున్నప్పటికీ, యువత ఆలోచనల్లో వచ్చిన మార్పు మూలంగా గ్యాంగ్ వార్ కోసం తెగించే ధోరణికి అడ్డుకట్ట పడింది.
 
అన్ని కులాల వారికి అవకాశం
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త సమీకరణాలు అనివార్యంగా ముందుకొస్తాయని సీనియర్ నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. "ఒకనాడు ఉన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు లేవు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులే రాజకీయ మార్పులకు మూలం. ఇవి మరింతగా మారతాయి. అందరికీ అవకాశాలు వస్తున్నాయి. రాజకీయాల్లో కూడా కొత్త తరం వస్తే మరిన్ని మార్పులు జరుగుతాయి"అని ఆయన బీబీసీతో అన్నారు. మార్పులను ఆహ్వానించాల్సిందేనని శోభనాద్రీశ్వర రావు అభిప్రాయపడ్డారు.
 
"రాజకీయంగా కమ్మ వర్సెస్ కాపు అన్నట్టుగా ఉన్న పరిణామాలు మారిపోయాయి. బీసీ నేతలు ముందుకొచ్చారు. ముస్లింలు, సగరల నుంచి కూడా పోటీ పడుతున్నారు. వైశ్య, బ్రాహ్మణ కులాలు కూడా రాజకీయ ప్రభావం చూపుతున్నాయి. యాదవ, గౌడ కులస్థులు కూడా గెలుస్తున్నారు. ఇవన్నీ మార్పునకు సంకేతం. నగర రాజకీయాల్లో కొందరి పెత్తనం నుంచి అందరికీ అవకాశాలు పెరగడం ఆశించదగినదే" అని సీనియర్ జర్నలిస్ట్ పి. రమణారావు అన్నారు. ఒక్క తూర్పులో తప్పా అటు మైలవరం నుంచి పెనమలూరు వరకు బీసీల ప్రభావం పెరుగుతోంది. ఇది కూడా మార్పునకు కారణమే అన్నారాయన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన లేకుండా టీడీపీ గెలుపు అసాధ్యం : హరిరామజోగయ్య