Jharkhand Election Results
జార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. జార్ఖండ్‌లో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. కౌంటింగ్ ట్రెండ్స్ మేరకు మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 50 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 41గా ఉంది. తద్వారా జార్ఖండ్‌లో మళ్లీ హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఏర్పడే అవకాశముంది.
జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి ఈ రెండు కూడా ఎన్నికల్లో బ్రహ్మాస్త్రాలుగా పనిచేశాయి. ఇందులో ఒకటి సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు రూ.2వేల 500 సాయంతో పాటు.. హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపడం కూడా ప్రజల్లో సెంటిమెంట్ రాజేసింది.
మరోవైపు జార్ఖండ్‌లో 24 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి బ్రేక్‌పడింది. హేమంత్ సోరెన్ ట్రెండ్స్‌లో పునరాగమనం చేస్తున్నాడు. నిజానికి 24 ఏళ్ల జార్ఖండ్ చరిత్రలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎప్పుడూ జరగలేదు. అయితే ఈసారి మాత్రం ఆ ట్రెండ్ మారే విధంగా అనిపిస్తోంది. జార్ఖండ్ రెండో సీఎంగా హేమంత్ సోరెన్ ఎంపికయ్యే అవకాశం వుంది.