Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియాంక గాంధీపై ‘జాతీయ జనసేన పార్టీ’ పోటీ.. ఎవరీ దుగ్గిరాల నాగేశ్వరరావు

Priyanka-Rahul

బిబిసి

, శనివారం, 23 నవంబరు 2024 (11:29 IST)
కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అక్కడ భారీ ఆధిక్యంలో ఉండడంతో ఆమె గెలుపు ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. ప్రియాంక ఇక్కడ విజయం సాధిస్తే పార్లమెంటులో తొలిసారి అడుగుపెట్టనున్నారు. వయనాడ్‌లో మొత్తం ప్రియాంక సహా మొత్తం 16 మంది పోటీలో ఉన్నారు. సీపీఐ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) నుంచి సత్యన్ మోకేరీ, బీజేపీ నుంచి నవ్యా హరిదాస్ ఆమెపై పోటీ చేశారు. వీరే కాకుండా స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు మరో 13 మంది ఇక్కడ బరిలో ఉన్నారు. ప్రియాంకపై వయనాడ్‌లో పోటీ చేసినవారిలో ఓ తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు.
 
తిరుపతి నుంచి వయనాడ్‌
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు జాతీయ జనసేన పార్టీ నుంచి వయనాడ్‌లో పోటీ చేశారు. ఆయన పేరు దుగ్గిరాల నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆ అంశాన్ని అందరి దృష్టికి తేవాలన్న లక్ష్యంతో ఇలా జాతీయ స్థాయి నాయకులపై పోటీ చేయాలనుకున్నట్లు నాగేశ్వరరావు ‘బీబీసీ’తో చెప్పారు. త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోనూ తమ పార్టీ నుంచి అభ్యర్థులను నిలుపుతామని నాగేశ్వరరావు చెప్పారు.
 
జాతీయ జనసేన పార్టీ..
ప్రియాంక గాంధీపై పోటీ చేసిన దుగ్గిరాల నాగేశ్వరరావు ‘జాతీయ జనసేన పార్టీ’కి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ పార్టీ మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో 74 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 9 లోక్‌సభ నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలిపారు. అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్టీ 2 చోట్ల పోటీ చేసింది. ప్రధాన పార్టీలతో పోటీ పడి విజయం సాధించకపోయినా ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై పోరాడే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు. ప్రస్తుతం వయనాడ్‌లో పోటీకి కూడా ప్రత్యేక హోదా అంశమే కారణమని చెప్పారు.
 
వయనాడ్‌లో ప్రియాంక ఎందుకు పోటీ చేశారు?
2019లో వయనాడ్ నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ 2024లోనూ ఆ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీలోనూ పోటీ చేశారు. రెండు చోట్లా విజయం సాధించిన ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాహుల్ వదులుకున్న ఆ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేశారు. మధ్యాహ్నం 11 గంటల సమమానికి ప్రియాంక 2 లక్షల 86 వేల ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ కంటే లక్ష 91 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయానికి జాతీయ జనసేన పార్టీకి చెందిన తెలుగు వ్యక్తి నాగేశ్వరరావు 205 ఓట్లు సాధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ 'తుఫాన్' ఎఫెక్ట్: మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకుంటున్న Mahayuti కూటమి