జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఓ దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ బాలికను ఒక కామాంధ ప్రియుడు లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత బాలికతో కామవాంఛ తీర్చుకున్నాడు. ఇంతలో ఆ బాలిక గర్భందాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగింది. దీంతో ఆమెను హత్య చేసిన ప్రియుడు.. ముళ్లపొదల్లో పాతిపెట్టాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రం పలాము జిల్లాలో కొరియాదిహ్ గ్రామానికి చెందిన 17 యేళ్ళ బాలిక, 18 వయస్సుగల యువకుడితో ప్రేమలోపడింది. ఆ తర్వాత పెళ్లి పేరుతో ఆ బాలికను శారీరకంగా వాడుకున్నాడు. ఇంతలో ఆ బాలిక గర్భందాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడ్ని ఒత్తిడి చేసింది. అయితే ఆమె ప్రియుడు అబార్షన్ కోసం ఒక నర్సును సంప్రదించగా రూ.10 వేలు అడిగింది.
అంత డబ్బు లేకపోవడంతో ప్రియురాలిని హత్య చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 21న ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం స్నేహితుడి సహాయంతో ఆమె మృతదేహాన్ని సోన్ నది తీరంలో పూడ్చిపెట్టాడు.
బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఫిబ్రవరి 27న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ప్రియుడితోపాటు సహకరించిన స్నేహితుడ్ని అరెస్ట్ చేశారు.