మహిళలపై దేశంలో అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖంఢ్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని బంధించిన దుండగులు నెలరోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు.
బహిర్భూమి కోసం వెళ్తున్నట్టు చెప్పిన ఆమె వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని బయటపడడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
తనను అపహరించి నెలరోజుల పాటు బంధించి 60 మంది దుండగులు లైంగికదాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని, మాట వినకపోతే కొట్టి హింసించేవారని చెప్పింది.
సరాయ్‌కేలా-ఖర్‌సావా జిల్లాలోని కందర్‌బేరా సమీపంలో మూతపడిన గ్యారేజీలో తనను నెల రోజులపాటు బంధించారని, 60 మంది తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధిత యువతి తెలిపింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని, అంతకుమించిన వివరాలు చెప్పలేకపోతోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.