తమ సినిమా థియేటరులో పని చేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ చందా చెల్లించలేదన్న కారణంతో సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్షి విధిస్తూ గతంలో తీర్పునిచ్చింది. దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లినా ఊరట లభించలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈమె పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆరు నెలల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కేసులో పిటిషనర్లు ఇప్పటికే చందా మొత్తం రూ.9.80 లక్షలు చెల్లించినందున కింద కోర్టు విధించిన శిక్షన సస్పెండ్ చేస్తున్నట్టు ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది. మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును ఆమె హైకోర్టులో సవాల్ చేయగా శిక్షపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
డ్రాగన్ కంట్రీలో భారీ భూకంపం - 110 మంది మృత్యువాత
డ్రాగన్ కంట్రీ చైనాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో దాదాపు 110 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికిపైగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చైనా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ భూకంపం చైనాలోని వాయువ్య గన్స్, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
భూకంపం ధాటికి పలు భవనాలు నేలకూలాయి. ప్రజలు భయాందోళనతో రోడ్ల వెంట పరుగులు తీశారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టాయి. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్థానిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.