Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్.పి. బాలు గారికి “భారత రత్న” ఇవ్వాలి: జయప్రద

ఎస్.పి. బాలు గారికి “భారత రత్న” ఇవ్వాలి: జయప్రద
, మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (18:55 IST)
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి “భారత రత్న” పురస్కారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి, ప్రధానికి సినీ నటి జయప్రద లేఖలు రాశారు. “భారత రత్న” పురస్కారం ప్రదానం చేయడం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి ఘనమైన నివాళని లేఖలో పేర్కొన్నారు జయప్రద. సినీ సంగీతానికి, భారత చలన చిత్ర పరిశ్రమకి ఎస్.పి.బి ఎనలేని సేవలు చేశారని లేఖలో వివరించారు జయప్రద.
 
లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బాలుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. ఈ మధుర గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు అత్యున్నత పురస్కారం ప్రకటించడం ద్వారా తగిన నివాళి అర్పించాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో... 
 
'ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి గానగంధర్వుడు మా రాష్ట్రంలోని నెల్లూరులో జన్మించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సెప్టెంబరు 25 శుక్రవారం ఆయన పరమపదించారు. ఆయన అకాల నిష్క్రమణం అభిమానులను, ప్రముఖులను కలతకు గురిచేయడమే కాదు, అంతర్జాతీయ సంగీత రంగాన్ని కూడా ప్రభావితం చేసింది. గత 50 ఏళ్లుగా ఆయన ప్రపంచ సంగీత పరిశ్రమపై చూపిన ప్రభావం, ఆయన అందుకున్న ప్రజాదరణ అపారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియుల నుంచి ధారాపాతంగా జాలువారుతున్న సుసంపన్నమైన నీరాజనాలే ఆయన ఘనతకు కొలమానాలు.
 
ఆయన ఘనతలు సంగీతాన్ని మించినవి. అసమాన ప్రతిభతో స్వరాల కూర్పును ఆయన ఉత్కృష్టస్థాయికి తీసుకెళ్లారు. ఆయన తన మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా 6 జాతీయ అవార్డులు, 25 నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అనేక పురస్కారాలతో ఆయనను గౌరవించాయి.
 
అంతేకాదు, ఆరుసార్లు దక్షిణభారత ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డులు కూడా పొందారు. 2016లో ఆయనను 'ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్' గా గుర్తించి 'సిల్వర్ పీకాక్ మెడల్' బహూకరించారు. ఆయన సంగీత సేవలకు ప్రతిగా భారత కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.
 
గతంలో కేంద్ర ప్రభుత్వం లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీమ్ సేన్ జోషి వంటి సంగీత దిగ్గజాలకు భారతరత్న ప్రకటించింది. సంగీతం, కళా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపుతూ, విశేష సేవలందించిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కూడా భారతరత్న ప్రకటించి ఆయనకు నివాళి అర్పించాలి. ఎప్పటికీ గుర్తుండిపోయేలా 5 దశాబ్దాల పాటు ఆయన అందించిన సంగీత సేవలకు ఇదే అత్యున్నత గుర్తింపు అవుతుంది" అంటూ సీఎం జగన్ తన లేఖలో వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామాంధుడు, సొంత అన్న చెల్లెలిని గర్భవతిని చేశాడు, మరో ఇద్దరు కూడా కలిసి?