జయలలితకు మోతాదుకుమించి స్టెరాయిడ్స్.. అందుకే...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా, జయలలితకు చేసిన ప్రాథమిక చికిత్సలో మోతాదుకుమించి స్టెరాయిడ్స్ వాడినట్టు ప్రభుత్వ ఆక్యుపంక్చర్ వైద్యుడు శంకర్ వెల్లడించాడు. ఈ మేరకు జయ మృతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్ ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు.
జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ అరుముగస్వామి కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ కమిషన్ ఎదుట జయలలితకు ఆక్యుపంక్చర్ వైద్యం చేసిన శంకర్ హాజరై సాక్ష్యం ఇచ్చారు. "జయలలిత అస్వస్థతకుగురైన వెంటనే ఆమె నివాసంలోనే ప్రాథమిక చికిత్స చేశారు. అప్పుడు ఆమె త్వరగా కోలుకునేందుకు వీలుగా మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చినట్టు గుర్తించాం" అని తెలిపారు.
కాగా, జయలలిత మృతి కేసులో ఆమెకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ అధికారులను కమిషన్ విచారించనుంది. అలాగే ఈనెల 20న జయ సన్నిహితురాలు, మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్, 21న మరో మాజీ సీఎస్ రామ్మోహనరావులు విచారణ సంఘం ఎదుట హాజరుకానున్నారు.