Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాట మారిన రాజకీయాలు.. అమ్మ మరణంతో అంతా మారిపోయిందా? అమ్మ బాటలోనే?

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణానికి తర్వాత తమిళ రాష్ట్రంలో రాజకీయ నాగరికత చిగురిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు పరస్పర విమర్శలు, ఆరోపణలతో నిప్పులు చెరుగుకుంటూ పార్టీలు అందు

తమిళనాట మారిన రాజకీయాలు.. అమ్మ మరణంతో అంతా మారిపోయిందా? అమ్మ బాటలోనే?
, సోమవారం, 19 డిశెంబరు 2016 (10:50 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణానికి తర్వాత తమిళ రాష్ట్రంలో రాజకీయ నాగరికత చిగురిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు పరస్పర విమర్శలు, ఆరోపణలతో నిప్పులు చెరుగుకుంటూ పార్టీలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. బద్ధ శత్రువులు అనే కోణం నుంచి స్నేహహస్తాలు చాచేందుకు సన్నద్దమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
 
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని పరామర్శించేందుకు అన్నాడీఎంకే నేతలు తంబిదురై, డి.జయకుమార్‌ శనివారం చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆస్పత్రికి వచ్చిన విషయం తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడులో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయిలో ఆ పార్టీలకు రాజకీయ వైరం ఉండటమే ఇందుకు కారణమని వారు చెప్తున్నారు. 
 
పైస్థాయి నేతలు మాత్రమే కాదు... కార్యకర్త కూడా ప్రత్యర్థి పార్టీపై ఇదే వైఖరి అవలంబించడం గమనార్హం. ఎంజీఆర్‌ హయాం వరకు శాసనసభలో అధికార, ప్రతిపక్షాలు మధ్య చర్చలు ఉద్రిక్తంగా జరిగినప్పటికీ శాసనసభ ముగిసిన తర్వాత ఆ రెండు పార్టీలూ కలిసిపోయేవి. 1991లో జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దృశ్యాలు మారిపోయాయి. 
 
డీఎంకే, అన్నాడీఎంకే మధ్య మాటలు, పరామర్శలు లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండు పార్టీల నేతలు ఎదురుపడ్డారంటే తమ ముఖాలు తిప్పుకుని వెళ్లిపోవాల్సిందే. ఇదే పరిస్థితి కిందిస్థాయి కార్యకర్తల్లోనూ కొనసాగింది. ఒకవేళ ఎవరైనా ప్రత్యర్థి పార్టీ వారితో మాట్లాడినట్టు, వారితో సంబంధాలు ఉన్నట్టు తెలిస్తే పార్టీ నుంచి ఉద్వాసన తప్పదు. 
 
2006-11 మధ్య డీఎంకే హయాంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే, నటుడు ఎస్వీ శేఖర్‌ను ఆ పార్టీ అధిష్ఠానం పక్కనపెట్టింది. దీంతో శాసనసభలో ఆయన పక్కనే కూర్చున్న సెంథిల్‌ బాలాజీ తన ముఖాన్ని మరొకవైపునకు తిప్పుకునేవారు. ప్రస్తుతం లోక్‌సభ ఉప సభాపతిగా ఉన్న తంబిదురై 2012లో తన కుమార్తె లాస్య పెళ్లికి కూడా వెళ్లలేదు. వరుడు నవీన్‌ శాసనసభలో ప్రతిపక్షం వరుసలో కూర్చున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్‌ కుమారుడు కావడమే ఇందుకు కారణమైంది. 
 
తండ్రిని ఒప్పించడం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో జయలలితను చూసేందుకు లాస్య ఏకంగా పోయెస్‌గార్డెన్‌కే వెళ్లారు. జయను కలిసేందుకు అనుమతి రాకపోవడంతో వెనుదిరిగి ఎట్టకేలకు తిరుపతిలో నవీన్‌ను పెళ్లి చేసుకున్నారు. అలాంటి తంబిదురై ప్రస్తుతం కావేరీ ఆస్పత్రికి వెళ్లి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. 'చిన్నమ్మ' తరఫున తాము వచ్చినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. 
 
దీనిని బట్టి జయలలిత హయాంలోనే అన్నాడీఎంకే, డీఎంకే మధ్య వాతావరణం చల్లబడటం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది సాధారణ శాసనసభ ఎన్నికల్లో గెలిచి అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌, ముఖ్యమంత్రి జయలలిత పరస్పర అభివాదాలు చేసుకున్నారు. గత అన్నాడీఎంకే హయాంలోనూ పలు సందర్భాల్లో జయలలితను స్టాలిన్‌ కలిసిన సందర్భాల్లోనూ ఇవే దృశ్యాలు కనిపించాయి. 
 
ముఖ్యమంత్రిగా జయలలిత పదవీప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన స్టాలిన్‌కు సముచిత స్థానం కల్పించలేదని ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో వాటిపై జయలలిత సానుకూలంగానే స్పందించారు. వెంటనే ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొస్తే అలా జరిగేది కాదంటూ విచారం వ్యక్తం చేశారు. జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు స్టాలిన్‌, కరుణానిధి సతీమణి, ఇతర డీఎంకే నేతలూ ఆమెను పరామర్శించడానికి అపోలో ఆస్పత్రికి వెళ్లారు.
 
తమ మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయనే విధంగా కరుణానిధి సైతం తన సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తూ జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే తమిళనాట రాజకీయ నాగరికత పెరుగుతుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ వరరల్డ్ 2016 కిరీటాన్ని కైవసం చేసుకున్న పోర్టారికో భామ