జయలలిత మహాసమాధిని చూసేందుకు పోటెత్తుతున్న జనం.. బుల్లితెర నటుల భాష్పాంజలి
చెన్నై మెరీనా తీరంలోని అమ్మ సమాధిని సందర్శించుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. అమ్మ ఇకలేరని తెలిసినా.. జయలలిత మహాసమాధిని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించే అభిమానుల దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టిస్తు
చెన్నై మెరీనా తీరంలోని అమ్మ సమాధిని సందర్శించుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. అమ్మ ఇకలేరని తెలిసినా.. జయలలిత మహాసమాధిని చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపించే అభిమానుల దృశ్యాలు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. చెన్నైలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన మెరీనా తీరం ప్రస్తుతం సందర్శకులు, అన్నాడీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలతో మరింత రద్దీగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఎంజీఆర్ స్మారక మండపం ప్రాంగణంలో జయలలిత మహాసమాధి ఉండటమే అందుకు కారణం. ఇక్కడ రోజురోజుకూ సందర్శకుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఆదివారం కూడా పలువురు ప్రముఖులు, అభిమానులు జయలలిత మహాసమాధిని సందర్శించుకున్నారు. బుల్లితెర కళాకారులు పలువురు గాంధీ విగ్రహం నుంచి జయలలిత స్మారకం వరకు ర్యాలీగా వచ్చారు. ఆపై మహాసమాధి పెద్ద పుష్పాంజలి ఘటించారు.
మదురై తూర్పు జిల్లా 'అమ్మ' పేరవై నిర్వాహకులు, ఇతర జిల్లాలకు చెందిన అభిమానులు కూడా సమాధిని సందర్శించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా 'అమ్మ' లేరని గుర్తుచేసుకుని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడు సంగీత విశ్వవిద్యాలయం ఉపకులపతి వీణా గాయత్రి ఆధ్వర్యంలో 'అమ్మ'కు నివాళిగా సాయంత్రం సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.