Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జల్లికట్టుకు కేంద్రం పచ్చజెండా...? తమిళనాడు ముసాయిదా ఆర్డినెన్సుకు సమ్మతం

తమిళ సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే... జల్లికట్టు కోసం తమిళనాడు ప్రభుత్వం ఆగమేఘాలపై రూపొందించిన ముసాయిదా ఆర్డ

Advertiesment
Jallikattu
, శనివారం, 21 జనవరి 2017 (08:47 IST)
తమిళ సంప్రదాయ గ్రామీణ సాహస క్రీడ జల్లికట్టు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే... జల్లికట్టు కోసం తమిళనాడు ప్రభుత్వం ఆగమేఘాలపై రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు కేంద్రం సమ్మతం తెలిపి, దానికి స్వల్పమార్పులు చేసి కేంద్ర హోంశాఖకు పంపించింది. ఇకపై ఈ ముసాయిదాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేయాల్సి వుంది. 
 
వాస్తవానికి జల్లికట్టు కోసం గత కొన్ని రోజులుగా ఆందోళనకు కొనసాగుతున్న విషయం తెల్సిందే. గత ఐదు రోజులుగా తమిళనాట పెల్లుబుకుతున్న నిరసనలను ఉపశమింపజేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, అనిల్‌ మాధవ్‌ దవేలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత  అన్నాడీఎంకే, బీజేపీ నేతలు ఢిల్లీలో జరిపిన చర్చలు జరిపారు. 
 
వీటి ఫలితంగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఓ ముసాయిదాను రూపొందించి ఢిల్లీకి తెప్పించుకుంది. దీనికి స్వల్ప మార్పులు చేసి కేంద్ర హోంశాఖకు పంపించగా, దీన్ని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం రాత్రి సమ్మతం తెలిపారు. ఇక్కడ నుంచి రాష్ట్రపతికి పంపించాల్సి ఉంటుంది. అంటే భవిష్యత్‌లో కూడా న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా కేంద్రం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసింది. 
 
మరోవైపు... తమిళ ప్రజలు జల్లికట్టు క్రీడపై భావోద్వేగంతో ఉన్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారం దిశగా సంప్రదింపులు జరుపుతున్నాయని, దీనిపై వెలువరించాల్సిన తీర్పును వాయిదావేయాలని అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ సుప్రీంకోర్టును శుక్రవారం అభ్యర్థించారు. వారంపాటు తన తీర్పు వాయిదాకు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఆర్‌.భానుమతిలతో కూడిన ధర్మాసనం ఇందుకు అంగీకరించింది.  
 
ఇదిలావుండగా, ఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అనిల్ దవే మాట్లాడుతూ కేంద్రం గతంలో పశువులపై క్రూరత్వ నిరోధక చట్టానికి రాష్ట్రప్రభుత్వం సవరణ చేస్తుందని, తద్వారా జల్లికట్టుకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ముసాయిదా ఆర్డినెన్సును తమకు వచ్చిందనీ, దానికి స్వల్ప మార్పులు చేసి హోంశాఖకు పంపించినట్టు తెలిపారు. దీనికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపి.. రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతుందని, దాన్ని రాష్ట్రపతి పరిశీలించిన పిదప సంతకం చేస్తారని, తద్వారా జల్లికట్టు పోటీలకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుర్ఖాలో ఉన్న మహిళలు అందమైనవారు, స్వేచ్ఛాపరులు కాదా: కేంద్రమంత్రికి జైరా జలక్