బుర్ఖాలో ఉన్న మహిళలు అందమైనవారు, స్వేచ్ఛాపరులు కాదా: కేంద్రమంత్రికి జైరా జలక్
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తితో సమావేశమై తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న దంగల్ సినిమా స్టార్ జైరా వసీమ్ ఈసారి కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయెల్‌ను నిలదీసింది. తన అనుభవాలను సామాజిక ఆంక్షలు, అడ్డంకులను బద్దలు గొడుతున్న ముస్లిం మహిళల అనుభవాలతో పో
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తితో సమావేశమై తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న దంగల్ సినిమా స్టార్ జైరా వసీమ్ ఈసారి కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయెల్‌ను నిలదీసింది. తన అనుభవాలను సామాజిక ఆంక్షలు, అడ్డంకులను బద్దలు గొడుతున్న ముస్లిం మహిళల అనుభవాలతో పోల్చిన కేంద్రమంత్రి పట్ల జైరా తీవ్ర నిరసన తెలిపింది.
బీజీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి విజయ్ గోయల్ ఒక ఆర్ట్ గ్యాలరీని గురువారం సందర్శించిన సందర్భంలో బురఖా ధరించిన అమ్మాయి, బోనులో ఉన్న అమ్మాయిని చిత్రించిన పెయింటింగ్‌ను చూసిన తర్వాత ట్వీట్ చేస్తూ ఈ పెయింటింగ్ సరిగ్గా జైరా వసీమ్ గాథనే చిత్రిస్తోందని వ్యాఖ్యానించారు.
మన కుమార్తెలు వారి బోన్ల నుంచి బయటకొచ్చి ముందడుగు వేస్తున్నారు. మన అమ్మాయిలకు మరింత శక్తి కలగాలి అని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
గోయల్ వ్యాఖ్యను చూసిన దంగల్ సినీ హీరోయిన్ జైరా శుక్రవారం మంత్రిపై వరుస ట్వీట్లను సంధించింది. సర్ మీరంటే నాకు గౌరవం, కాని అంత అమర్యాదకమైన, మోటైన చిత్రాన్ని నాతో ఎందుకు ముడిపెడుతున్నారు, ఈ విషయంలో నేను మీతో విభేదిస్తున్నాను అంది జైరా.
ఆ చిత్రంలో కనిపిస్తున్న పెయింటింగ్ ఏ కొంచెం కూడా నాకు సంబంధించింది కాదు అని జైరా కొట్టిపారేసింది. పైగా హిజాబ్ (బురఖా)లో ఉన్న మహిళలు అతి సుందరులు, స్వేచ్ఛాపరులు అని జైరా వ్యాఖ్యానించింది. జైరా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపడంతో కేంద్రమంత్రి గోయల్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
జైరా తన ట్వీట్‌లను తప్పుగా అర్థం చేసుకుందని పేర్కొన్నారు. జైరా కృషిని తాను అభినందిస్తున్నానని, దుష్టత్వంతో కూడిన, పితృస్వామిక దురభిప్రాయాలను ప్రోత్సహించకూడదని మాత్రమే తానన్నానని మంత్రి సమర్థించుకున్నారు. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని, నీ కృషిని అభినందిస్తున్నానని మంత్రి చెప్పారు. నీతో కలిసి పరస్పరం అభిప్రాయాలు పంచుకోవాలని కూడా గోయల్ పేర్కొన్నారు.