భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వీఎస్ఎస్సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్షను రద్దుచేశారు. వేరొకరికి బదులుగా పరీక్షలు రాస్తూ మోసగించారనే ఆరోపణలపై హర్యానాకు చెందిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీనిపై కేరళ పోలీసులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించగా, ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు వీఎస్ఎస్సీ ప్రకటించింది.
టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్ మెన్-బి, రేడియోగ్రాఫర్-ఏ పోస్టుల కోసం మళ్లీ ఎప్పుడు పరీక్షలు జరిగేదీ తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. జాతీయస్థాయి పరీక్షను ఒక్క కేరళలోనే 10 కేంద్రాల్లో నిర్వహించారు. వేరేవారికి బదులుగా పరీక్షలు రాస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరితోపాటు హర్యానాకు చెందిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరీక్షను రద్దు చేయాలని వీఎస్ఎస్ఏసీని పోలీసులు కోరారు.
హర్యానా నుంచే 400 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో కోచింగ్ కేంద్రాల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నిగ్గు తేల్చడానికి కేరళ నుంచి పోలీసుల బృందం హర్యానాకు వెళ్లనుంది. పరీక్షలో ఏదో అక్రమాలు జరుగుతాయంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా ఇన్విజిలేటర్లను అప్రమత్తం చేసినప్పుడు బండారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు.