రైలు టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్‌లో రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. ఇకపై సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. మొదటి 15 నిమిషాలు కేవలం అథార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే ఐఆర్‌సీటీసీ లేదా అధికారిక యాప్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఇది తత్కాల్ బుకింగ్ విధానంలో అమల్లో ఉంది. అక్టోబరు 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.
ఏదైనా ట్రైన్‌కు ప్రస్తుతం 60 రోజుల ముందే టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు సౌలభ్యం ఉంది. కానీ, తత్కాల్ టికెట్ల మాదిరిగానే బుకింగ్ ప్రారంభమైన వెంటనే అక్రమార్కులు సాఫ్ట్‌వేర్ సాయంతో టికెట్లను బుక్ చేసేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు.
ఈ నేపథ్యంలో రిజర్వేషన్ టికెట్లు పక్కదోవ పట్టకుండా సామాన్య యూజర్‌కు ఆ ప్రయోజనాలు అందాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది. రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పూ ఉండదు.