భూమి నుంచి 40 వేల అడుగుల ఎత్తులో ఓ క్షిపణి. రివ్వుమంటూ ధ్వనికంటే మూడురెట్లు వేగంతో పాక్ భూభాగంలో ల్యాండైంది. దాని ధాటికి పాకిస్తాన్ భూభాగంలో వున్న ఓ ఇల్లు ధ్వంసమైంది. ఈ క్షిపణి హర్యానా నుంచి వెళ్లింది. ఇంతకీ ఏం జరిగింది?
మార్చి 9న భారతదేశం వైపు నుండి పాకిస్తాన్‌లోని ఒక ప్రాంతంలో ప్రమాదవశాత్తూ క్షిపణి ల్యాండ్ అయ్యింది. దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం మాట్లాడుతూ, సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన చోటుచేసుకున్నదనీ, దీనిపై తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.
మార్చి 9న సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తూ క్షిపణి పేలింది. భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయమని పేర్కొంది.
పాకిస్తాన్ అధికారి ఒకరు మాట్లాడూతూ... క్షిపణి తమ గగనతలం లోపల 100 కి.మీ కంటే ఎక్కువ దూరం లోపలికి చొచ్చుకుని వచ్చిందనీ, ఆ సమయంలో అది 40,000 అడుగుల ఎత్తులోనూ, ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో దూసుకొచ్చిందని చెప్పారు. క్షిపణిపైన వార్ హెడ్ లేకపోవడంతో అది పేలలేదన్నారు.
తమ గగనతలాన్ని అకారణంగా ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ తీవ్ర నిరసన తెలిపింది. ఆ సమయంలో ప్రయాణీకుల విమానాలు, పౌరుల జీవితాలకు ప్రమాదం జరిగి వుంటే ఏమయ్యేదని ప్రశ్నించింది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని భారత్‌ను పాకిస్థాన్ హెచ్చరించింది. కాగా క్షిపణి కారణంగా ధ్వంసమైన ఇంటికి నష్టపరిహారం ఇస్తామని భారత ప్రభుత్వం తెలిపింది.