తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరులోని కాట్టేరి అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్ కూలిపోయింది. ఆ సమయంలో అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది చనిపోయినట్టు నీలగిరి జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. వీరిలో భారత త్రివిధ దళాధిపతి (సీడీఎస్ చీఫ్) బిపిన్ రావత్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో అధికారికంగా ప్రకటించారు.
నిజానికి ఈ హెలికాఫ్టర్‌లో ప్రయాణంచిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మాత్రం ప్రాణాలతో బయటపడినట్టు తొలుత వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆయన శరీరం 90 శాతం మేరకు కాలిపోయినట్టు కనిపించింది. అయితే, బిపిన్ రావత్ మృతి చెందినట్టు అధికారికంగా ప్రటించారు.
మరోవైపు, ఈ ప్రమాదం నుంచి హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ 80 శాతం కాలిన గాయాలతో బయటపడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో ఉన్నది బిపిన్ రావత్తా లేక కెప్టెన్ వరుణా అనేది తేలాల్సివుంది.