భూగోళాన్ని కబళించిన కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధం ప్రారంభించామని, అందువల్ల 21 రోజుల పాటు ఇల్లుదాటి బయటకు రావొద్దని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
కరోనాపై పోరాటంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ఒక వారంలో రెండోసారి అత్యంత కీలకమైన ప్రసంగం చేశారు. దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని, ఎవరూ ఇల్లు దాటొద్దని హెచ్చరించారు. ఈ లాక్ డౌన్ నిర్ణయం లక్ష్మణరేఖలా కాపాడుతుందని, 21 రోజుల లాక్ డౌన్ మన ప్రాణాల కంటే ఎక్కువేం కాదని అన్నారు.
ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మన చేతుల్లో ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ఇది ఎంతో కఠిన నిర్ణయం అయినా, ఎంతో నష్టం తప్పదని తెలిసినా ప్రజాసంక్షేమం దృష్ట్యా తీసుకోకతప్పడం లేదని తెలిపారు. 24 గంటలు పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధుల క్షేమం కోసం ప్రార్థిద్దామని సూచించారు.
ఈ లాక్ డౌన్ 21 రోజుల పాటు కొనసాగుతోందని తెలిపారు. లాక్ డౌన్ మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ వంటిదని, ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ పరిధిలోకి వస్తాయని, ప్రతి నగరం, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి వీధి లాక్ డౌన్ తప్పదన్నారు. ఈ కరోనా వైరస్ మహమ్మారి గొలుసు కట్టును విడగొట్టేందుకు ఇదొక్కటే ఏకైక మార్గమని నిపుణులు చెప్పారని, అందుకే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు.