దేశంలో మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ రియాల్టీ చెక్ సిరీస్ పేరుతో విశ్లేషణాత్మక రాజకీయ కథనాలను ఎప్పటికప్పుడు అందించనుంది.
ఈ తరహా కథనాలను ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ తరహా కథనాలను వారంలో ఐదు రోజుల పాటు ఆరు భారతీయ భాషల్లో అందజేయనుంది. ఎన్నికల వాస్తవికతను అద్దంపట్టేలా తమ ప్రేక్షకులకు వివరించనుంది. ఈ కథనాలు హిందీ, మరాఠీ, గుజరాతీ, తెలుగు, తమిళం, పంజాబీ భాషల్లో అందించనున్నారు.
సార్వత్రిక ఎన్నికల కోసం ప్రత్యేకంగా విశ్లేషణాత్మక కథనాలను అందిస్తామని గత యేడాది సెప్టెంబరు నెలలో జరిగిన ఓ సమావేశంలో బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్రూపు డైరెక్టర్ జిమీ అంగుస్ హామీ ఇచ్చారు. గత యేడాది నవంబరు నెలలో 'అసత్య వార్తల వెనుక' అనే పేరుతో బీబీసీ ఓ సర్వీస్‌ను ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా వివిధ కాలేజీలు, పాఠశాలల్లో అసత్య వార్తలు, డిజిటల్ లిటరసీ అంశాలపై సదస్సులను నిర్వహించిన తర్వాత ఈ తరహా ఆలోచన వచ్చింది. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా? లేదా? నిజమైన అంశాలను వెల్లడిస్తున్నారా అనేది బీబీసీ రియాలిటీ చెక్ పరిశీలనలో తెలుస్తుందన్నారు.
ముఖ్యంగా, తప్పుడు వార్తలపై తక్షణం స్పందించేలా, వాస్తవికత అంశాలు తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా, స్వాతంత్ర్య విలువను తెలియజెప్పేలా విశ్లేణాత్మక అంశాలు ఉంటాయన్నారు.
బీసీసీ ల్యాంగ్వేజెస్ అధిపి రూపా ఝా స్పందిస్తూ, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల చర్చలు, ఇష్టాగోష్టిల్లో వాస్తవిక అంశాలను తనిఖీ చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా, ఎన్నికల సమయంలో కొంత వాస్తవిక అంశాలతో కూడిన సమాచారాన్ని అందించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ విశ్లేణాత్మక కథనాలు అంశాలను స్పృశించేలా ఉంటాయని వారు పేర్కొన్నారు.