రైతులకు పీఎం-కిసాన్ పథకం నిధులు అందజేయాలంటే ఇకపై ఆధార్ తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన రైతులకు ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలుంటేనే నగదును బదిలీ చేస్తామని వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు.
ఈ నిబంధన ఈ నెల నుంచే అమలవుతుందన్నారు. దేశవ్యాప్తంగా పీఎం-కిసాన్ పథకం కింద 14 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున అందజేస్తున్నారు. ఇక ఆధార్ లేదన్న కారణంతో రేషన్ కార్డుల డేటాబేస్ నుంచి లబ్ధిదారుల పేర్లు తొలగించవద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించినట్లు ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాసవాన్ లోక్‌సభలో తెలిపారు.
ఆధార్ లేదన్న సాకుతో ఆహార ధాన్యాలను నిరాకరించడం లేదా కార్డుదారుల పేర్లను తొలగించడం వంటివి చేయొద్దని ఆదేశించామన్నారు. నోట్ల రద్దు, డిజిటలైజేషన్ కారణంగా నగదు చెలామణీ రూ.3 లక్షల కోట్ల మేర తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు.
కేంద్రం రూ.2000 నోటును రద్దు చేస్తుందన్న ఆందోళన అక్కర్లేదని, ఆ ఆలోచనేదీ లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠా కూర్ రాజ్యసభలో చెప్పారు. అసోంలో 1.29 లక్షల మంది విదేశీయులు న్నట్లు ట్రైబ్యునళ్లు తేల్చాయని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రా య్ లోక్‌సభలో తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 2022 కల్లా దేశంలో 1.2 లక్షల మంది కమ్యూనిటీ ఆరోగ్య అధికారులను నియమిస్తామని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే రాజ్యసభలో వెల్లడించారు.