వేసవికాలం రావడంతో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగిపోయింది. దీంతో గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులు కూడా తడిసి మోపెడతువుతున్నాయి. అయితే, గృహ, వాణిజ్య సంస్థలు ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగంలో 6 శాతం మేరకు ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) తెలిపింది. దీనివల్ల యేడాదికి సుమారు 20 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
సాధారణంగా చాలా మంది 20 డిగ్రీల వద్ద ఏసీలను వినియోగిస్తున్నారు. హోటళ్ళు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, వాణిజ్య ప్రదేశాల్లో ఏసీలను వినియోగించేటపుడు 24 డిగ్రీలు పెడితే కర్బన ఉద్ఘరాల విడుదల తగ్గుతుందని, ఏసీల జీవితకాలం కూడా పెరుగుతుందని తెలిపింది. ఈ అంశంపై విస్తృత చర్చ, ప్రచారం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఆదేశించాం అని తెలిపారు.