మాజీ ప్రధాని దేవెగౌడ కేంద్ర వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యసభలో రైతు ఉద్యమంపై చర్చ సందర్భంగా దేవగౌడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. సిమెంటుతో గోడలు నిర్మించే బదులు ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపితే బాగుంటుంది కదా...'' అంటూ వ్యాఖ్యానించారు. కొందరు దురాక్రమణదారులు చేసిన తప్పుకు రైతులందరినీ బలిపశువులు చేయడం భావ్యం కాదని దేవెగౌడ స్పష్టం చేశారు.
''నేను జీవిత చరమాంకంలో ఉన్నా... ఈ సమస్యను ప్రభుత్వం శాంతియుతంగా పరిష్కరించాలి. చర్చలకు రైతు సంఘాలను పిలవాలి. ఈ సమస్యకు అవసరమైన పరిష్కారాన్ని మేమూ ఇస్తాం. ఇలా చేస్తే గానీ ఓ సమస్య పరిష్కారం అయ్యేట్లు లేదు.
రైతులను ఇబ్బందిపెడితే, వారిపై కఠిన వైఖరిని అవలంబిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ అలా పరిష్కారం కాదని పేర్కొన్నారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసకు రైతులు ఎంత మాత్రమూ కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.