ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ తరహా ఘటన హర్యానా రాష్ట్రంలోనూ జరిగింది. లఖీంపూర్ ఖేరి ఘటనకు నిరసన తెలుపుతున్న రైతులపైకి బీజేపీ ఎంపీ నయాబ్ సైనీకి చెందిన కారు దూసుకెళ్లింది. ఇందులో ఓ వ్యక్తి గాయపడ్డారు.
గురువారం జరిగిన ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు రైతులు ఆరోపించారు. గాయపడిన రైతును అంబాల సమీపంలోని నారిన్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, అతడి పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని తెలిపారు. తనపైకి బీజేపీ ఎంపీ కారు దూసుకురాగా తృటిలో తప్పించుకున్నట్లు ఒక రైతు ఆరోపించాడు.
కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ, హర్యానా మైనింగ్ మంత్రి మూల్ చంద్ శర్మతో సహా ఇతర పార్టీ నాయకులు గురువారం నారిన్‌గఢ్‌లోని సైనీ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, బీజేపీ నేతల పర్యటనను వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు ఆ భవనం బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ కార్యక్రమం ముగియడంతో బయటకు వచ్చిన బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ కారు నిరసన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఒక రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని హర్యానా రైతులు డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీలోపు ఇది జరుగకపోతే పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
లఖీంపూర్ ఖేరిలో ఇదే విధంగా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశీష్ మిస్రా కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు, ఒక కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.