ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కామాంధులు దురాగతానికి మరో యువతి బలైంది. ఇటీవల హత్రాస్‌లో అత్యాచారానికి గురైన 20 యేళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతు కన్నుమూసింది. ఈ యువతిపై కామాంధులు అత్యాచారం జరిపి, ఆ తర్వాత విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు నాలుకను కోసేసిన విషయం తెల్సిందే. పైగా, ఆ యువతిని నలుగురు కామాంధులు తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది.
అయితే, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనికి కారణం బాధితురాలు షెడ్యూల్ కులానికి చెందిన యువతి కావడం, అత్యాచారానికి పాల్పడిన నిందితులు అగ్రవర్ణ కులానికి చెందిన వారు కావడంతో కేసు నమోదు చేయకుండా తాస్కారం చేశారు. అయితే, ఆ యువతి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో చివరకు ఆ నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి ఇటీవలే అరెస్టు చేశారు.
ఈ కేసులో ఆలస్యంగా చర్యలు తీసుకోవడం పట్ల బాధితురాలి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై అతను మాట్లాడుతూ, ఈ నెల 14న తన తల్లి, సోదరుడితో కలిసి గడ్డి కోసం ఆ యువతి పంట పొలాలకు వెళ్లింది. గడ్డి కోసుకుని ఆమె సోదరుడు ఇంటికి వెళ్లిపోయాడు. తల్లి, కూతురు పొలంలోనే పనులు చేస్తూ ఉండిపోయారు.
తల్లికి కొంత దూరంలో ఉన్న యువతిని పనులు చేసుకుంటుండగా నలుగురు దుండగులు సమీపంలో ఉన్న చేనులోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, దాడి చేశారు. ఆ తర్వాత కొంత సేపటికి విషయాన్ని గుర్తించిన ఆమె తల్లి, స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.