పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాహుల్, ప్రియాంకగాంధీలను మీరట్ నగర సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఆపివేసిన తర్వాత బీజేపీ సీనియర్ నాయకుడైన మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ''లైవ్ పెట్రోల్ బాంబులు'' వంటి వారని హర్యానా మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎక్కడికి వెళ్లితే అక్కడ మంటలు రేపుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు కాలు మోపిన ప్రతీ చోటా మంటలు రేగి ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లుతోందని అన్నారు.
ఇంకా అనిల్ విజ్ ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లు ప్రాణాలతో ఉన్న పెట్రోల్ బాంబు లాంటి వాళ్లు. వారు అడుగుపెట్టిన చోట అగ్గి రాజేసి, ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమవుతారని ట్వీట్ చేశారు.