హైదరాబాద్ వీధుల్లో కోటీశ్వర 'బిచ్చగాడు' అజ్ఞాతవాసం! ఎందుకు?
మహాభారతంలో పంచపాండవులు జూదంలో ఓడిపోయి అజ్ఞాతవాసం గడుపుతారు. అలాగే, 'బిచ్చగాడు' చిత్రంలో హీరో తన అమ్మ బాగుకోసం బిచ్చగాడుగా అవతారమెత్తుతాడు. ఇపుడు అభినవ బిచ్చగాడు హైదరాబాద్ వీధుల్లో నెలరోజుల పాటు అజ్ఞాత
మహాభారతంలో పంచపాండవులు జూదంలో ఓడిపోయి అజ్ఞాతవాసం గడుపుతారు. అలాగే, 'బిచ్చగాడు' చిత్రంలో హీరో తన అమ్మ బాగుకోసం బిచ్చగాడుగా అవతారమెత్తుతాడు. ఇపుడు అభినవ బిచ్చగాడు హైదరాబాద్ వీధుల్లో నెలరోజుల పాటు అజ్ఞాతవాసం గడిపాడు. వేల కోట్ల రూపాయల్లో ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ... ఒక్క పూట తిండికోసం బిచ్చమెత్తాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? తండ్రి ఆదేశం మేరకు కడుపేదోడి బతుకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు. ఈ అజ్ఞాతపరీక్షలో అతను విజయం సాధించాడా లేదా అనేది ఇపుడు తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఒకరు ఘన్‌శ్యామ్ డోలాకియా. ఈయనే హరేకృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్స్ యజమాని. ఈయన కుమారుడు... హితార్థ్. దాదాపు రూ.6 వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే అధిపతి. వేల కోట్లకు అధిపతికావాలంటే తండ్రి ఓ కాల పరీక్ష పెట్టాడు. అదే నెల రోజుల అజ్ఞాతవాసం. అంతే.. తండ్రి ఆదేశాన్ని తూ.చా. తప్పకుండా పాటించాడు హితార్థ్.
తండ్రి కొనిచ్చిన ఫ్లైట్ టికెట్‌ను జేబులో పెట్టుకుని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అక్కడ టిక్కెట్ చూసిన తర్వాతే తాను హైదరాబాద్‌కు వెళుతున్నట్టు హితార్థ్ తెలుసుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత బస్సులో సికింద్రాబాద్ చేరుకున్నాడు. తొలిరోజు రూ.100కు ఒక హోటల్‌లో మంచాన్ని అద్దెకు తీసుకుని ఒక్కరాత్రి ఉన్నాడు. తాను ఉద్యోగం కోసం వచ్చానని, రైతు కుటుంబీకుడినని చెప్పాడు. ఉద్యోగాలు లభించే ప్రాంతాల గురించి ఒక్కొక్కరూ ఒక్కో సలహాను ఇవ్వగా, ఓ బస్సు కండక్టర్ సూచన మేరకు అమీర్‌పేట వెళ్లి ప్రయత్నించాడు.
ఆ తర్వాత హైటెక్ సిటీకి వెళ్లి పలు కంపెనీల్లో పని చేశాడు. ఆపై సికింద్రాబాద్‌లోని వైట్ బోర్డు తయారీ సంస్థలో కుదురుకున్నాడు. కొన్ని రోజులు రిక్షా కార్మికుడితో, మరికొన్ని రోజులు సాధువుతో కలసి ఓ గదిలో రోజులు వెళ్లదీశాడు. రోడ్‌సైడ్ కొట్టుల్లో టిఫన్, భోజనం చేశాడు. అలా నెల రోజుల అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత తాను ఎక్కడున్నాడనే విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశాడు. దీంతో అతని సోదరి కృపాలి, పెదనాన్న తదితరులు హైదరాబాద్‌కు వచ్చిన అతని కష్టాలను తెలుసుకుని కన్నీరుకార్చారు. ఈ విషయం ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది మీడియాకు తెలిపారు.
ఇంతకీ హితార్థ్ హైదరాబాద్‌కు వచ్చేటపుడు ఫ్లైట్ టిక్కెట్‌తో పాటు.. కేవలం రూ.500 చేరుకున్నాడు. తన అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసేందుకు నెల రోజుల పాటు కూలీగా పనిచేశాడు. తండ్రి సూచించినట్టుగా బతికి చూపించాడు. సామాన్య బతుకు ఎలా ఉంటుందో రుచి చూశాడు. తన అజ్ఞాతవాసంపై హితార్థ్ స్పందిస్తూ.. హైదరాబాద్ తనకెంతో నచ్చిందని, తాను ఓ సాధారణ యువకుడిగా కనిపించలేక పోయానని, అయితే, తనకు తారసపడిన వారంతా సాయం చేయాలనే చూశారని హితార్థ్ వెల్లడించారు.
ఉద్యోగం కావాలని చెబితే, ఎంతో మంది సాయం చేయాలని భావించారని, ఈ నెల రోజుల జీవితం ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నారు. ఈ నగరం చాలా అందంగా ఉందని, మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు. కాగా, హితార్థ్ సోదరుడు గతంలో ఇదేవిధంగా అజ్ఞాతవాసం చేసి కేరళలో కూలీగా పనిచేస్తూ నెల రోజులు గడిపిన విషయం తెల్సిందే.