Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు...

స్వాతంత్ర్య దినోత్సవ శుభదినాన... గగనంలో రివ్వు రివ్వున ఎగిరే ముచ్చటైన మువ్వన్నెల జెండాయే, భారతమాత చేతిలో ఆయుధమైన భారతీయులకు రక్షణనిస్తుంది. ఈ జెండాలోని కాషాయం రంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి, తమ కర్తవ్యానికి అంకితం కావ

దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు...
, శుక్రవారం, 11 ఆగస్టు 2017 (22:13 IST)
స్వాతంత్ర్య దినోత్సవ శుభదినాన... గగనంలో రివ్వు రివ్వున ఎగిరే ముచ్చటైన మువ్వన్నెల జెండాయే, భారతమాత చేతిలో ఆయుధమైన భారతీయులకు రక్షణనిస్తుంది. ఈ జెండాలోని కాషాయం రంగు త్యాగానికి గుర్తు. ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి, తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది. తెలుపురంగు మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు, సత్యానికి గుర్తుగా భాసిల్లుతోంది. 
 
ఇక మూడవదైన ఆకుపచ్చ రంగు మట్టితో మనకున్న అనుబంధానికి, ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపదమీద ఆధారపడి ఉన్నాయో... ఆ పచ్చటి చెట్లకు గుర్తు. జెండాలోని అశోకచక్రం ధర్మపాలనకు గుర్తు. సత్యం, ధర్మం అనేవి ఈ పతాకం క్రింద పనిచేసే ప్రతి ఒక్కరి నియమాలు కావాలి. 
 
చక్రం చలనానికి, చైతన్యానికి గుర్తు. జీవముండే ప్రతిచోటా చైతన్యం ఉంటుంది. చైతన్యం లేనిది చావులోనే అనేది గుర్తుంచుకోవాలి. భారతదేశం ఇకమీదట మార్పును స్వాగతిస్తూ ముందుకు సాగిపోవాలనేదాన్ని సూచిస్తున్నట్లుగా ఉండే చక్రం... శాంతియుతమైన, చైతన్యవంతమైన ప్రగతికి చిహ్నం. 
 
ఇదిలావుంటే... కాషాయం స్వచ్ఛతకు, ఆధ్యాత్మికతకు.. తెలుపు శాంతికి, సత్యానికి... ఆకుపచ్చ సాఫల్యతకు, సస్యసమృద్ధికి చిహ్నాలుగా భావిస్తారనే ఒక అనధికారిక అన్వయం కూడా బాగా ప్రచారంలో ఉంది. 
 
"ఝండా ఊంఛా రహే హమారా..." అనే పాటను వినని వారుండరు. ఆ పాటను వింటుంటే భారతీయ హృదయాలు పొంగిపోతాయి. మువ్వన్నెల జెండా రెప రెపలాడుతుంటే చిన్న చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళ గుండెలూ సంతోషంతో నిండిపోతాయి. గర్వంగా తలఎత్తి సెల్యూట్‌ చేయాలనిపిస్తుంది. 
 
భారతదేశంలోని ఏ మూలైనా 15 ఆగస్టు, 26 జనవరి నాడు -మువ్వన్నెల జెండా ఎగురవేసి పండుగ చేసుకుంటారు. సంబరాలు జరుపుకుంటారు. ఆ రెండు రోజులూ ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించుకొని, స్వతంత్ర సముపార్జనలో ప్రాణాలొడ్డిన మహనీయులను స్మరించుకుంటారు. 
 
కాగా... ఆధునిక పోకడలో ఎందరో మన జాతీయ జెండా ప్రాముఖ్యాన్ని మరిచిపోతున్నారు. జాతీయ పతాకమే కాదు జాతీయ గీతాన్ని కూడా పాడటం లేదు. ఎవరయినా సరే జాతీయ జెండాను అవమానపరిస్తే కఠిన శిక్ష విధించబడుతుంది. మన రాజ్యాంగంలోని 42వ అధికరణం 4 (ఎ) సవరణ ప్రకారం విధిగా ప్రతి పౌరుడూ భారత జాతీయ జెండాను గౌరవించాలి. 
 
మనం మన భవిష్యత్తరాలకు జాతీయ గీతం, జాతీయ పతాకం విశిష్టతను ప్రాముఖ్యతను చెప్పలేకపోతే, ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సముపార్జించిన స్వాతంత్య్రానికి విలువలేకుండా పోతుంది. అందుకే మనం మన జెండా గురించి, జెండా పండుగ గురించి తెలుసుకోవాల్సి ఉంది. మరొకరికి తెలియచెప్పాల్సిన అవసరమూ ఉంది. 
 
ప్రతిమనిషికి పేరు (గుర్తింపు) అన్నట్లే, దేశానికి గుర్తింపు ఉంటుంది. అదే దేశానికి తొలి ఆనవాలు (గుర్తు) అదే జాతీయ పతాకం అంటే ఆ దేశ సమస్త ప్రజల ఆత్మగౌరవం, గుండెచప్పుడు... వారి సార్వభౌమ అధికారం ఎవరికీ తలవంచని దేశాధ్యక్షుడైనా జాతీయ పతాకానికి తలవంచి నమస్కరించాల్సిందే...!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశం అలా అంటే చైనాకు రోజుకు రూ.100 కోట్లు నష్టం...